నిజామాబాద్‌అర్బన్ : ఓటర్ల జాబితాలో ఒక వ్యక్తికి ఒకటి కన్నా ఎక్కువ ఓట్లు ఉండటం, తప్పుడు సమాచారం ఇవ్వడం శిక్షార్హమైన నేరాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 17 ప్రకారం ఏ వ్యక్తి కూడా ఒకటి కన్నా ఎక్కువ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో తన పేరును నమోదు చేసుకోవడానికి అర్హుడు కాదని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా తయారీ, సవరణ, పేర్ల నమోదు లేదా తొలగింపుల సమయంలో తప్పుడు సమాచారాన్ని, లిఖితపూర్వక డిక్లరేషన్‌ను సమర్పిస్తే, అది తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందన్నారు. అలాంటి వారికి సంవత్సరం వరకు జైలు శిక్ష, లేదా జరిమానా, లేదా ఈ రెండూ విధించబడతాయని తెలిపారు. ఓటర్లందరూ చట్టపరమైన నిబంధనలను విధిగా పాటించాలని సూచించారు. ఒకటి కన్నా ఎక్కువ ఓట్లు ఉంటే ఫారం–7 ద్వారా తొలగించుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఎన్యుమరేషన్ ఫారంను అందజేసిన కలెక్టర్
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం తన ఎన్యుమరేషన్ ఫారంను బీఎల్‌వోకు అందజేశారు. జూన్ 25న బీఎల్‌వో, సూపర్‌వైజర్లు కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఎన్యుమరేషన్ ఫారం అందజేసిన విషయం తెలిసిందే. వాటిని పూర్తి చేసిన అనంతరం కలెక్టర్ గురువారం సాయంత్రం బీఎల్‌వోకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పారదర్శక ఓటరు జాబితా రూపకల్పన కోసం ఎన్నికల సంఘం అమలు చేస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణలో అందరూ పాల్గొనాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వినయ్‌సాగర్, బీఎల్‌వో రుక్మిణి, సూపర్‌వైజర్ హరీశ్‌రెడ్డి పాల్గొన్నారు.


