● ఇన్‌స్ట్రక్టర్ పోస్టులకు 3,404..
ఆయాలకు 750 దరఖాస్తులు
● ఆశగా ఎదురు చూస్తున్న అభ్యర్థులు
ఖలీల్‌వాడి: జిల్లాలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభమైనప్పటికీ టీచర్లు (ఇన్‌స్ట్రక్టర్లు), ఆయాల నియామకం ఆలస్యమవుతోంది. జూన్ 15వ తేదీ నుంచే పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభం కావాల్సి ఉండగా 18 రోజులవుతున్నా ఇంత వరకు పోస్టుల నియామకం పెండింగ్‌లోనే ఉంది. జిల్లాలో కొత్తగా 112 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీని ప్రారంభిస్తూ విద్యాశాఖ మే 26న ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్‌స్ట్రక్టర్‌కు రూ.8 వేలు, ఆయాలకు రూ.6 వేలు వేతనం చెల్లించాలని నిర్ణయించి విద్యార్హతలను సైతం స్పష్టం చేశారు. ఇన్‌స్ట్రక్టర్ పోస్టులకు 3,404 మంది, ఆయా పోస్టులకు 750 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎంపిక ప్రక్రియను కలెక్టర్ ఆధ్వర్యంలో చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎంపికకు తుది గడువు లేకపోవడంతో నియామకాలు ఎప్పటికి పూర్తవుతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.
జిల్లా కేంద్రానికి ఒకటి లేదా రెండు దరఖాస్తులే?
ఇన్‌స్ట్రక్టర్ పోస్టులకు ఒక్కో చోట వందలాది దరఖాస్తులు అందగా, ఎంఈవోలు ఒకరిద్దరి పేర్లను మాత్రమే జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పంపించారనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల నుంచి పెద్ద ఎత్తున సిఫారసులు, ఒత్తిళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని జిల్లాల్లో ఇంటర్ మార్కుల ఆధారంగా, మరికొన్ని జిల్లాల్లో డీఈడీ, బీఈడీ, మరికొన్ని చోట్ల ప్రీ ప్రైమరీ కోర్సులు చేసిన వారిని నియమిస్తామని చెబుతుండడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. పాఠశాల విద్యాశాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. డీఈవో పార్శి అశోక్‌ను వివరణ కోరగా త్వరలోనే ప్రీప్రైమరీ స్కూళ్లలో పోస్టులను నియామకం చేపడతామన్నారు.


