అయినకాడికి ఆక్రమణ | - | Sakshi
Sakshi News home page

అయినకాడికి ఆక్రమణ

Jul 2 2026 3:05 AM | Updated on Jul 2 2026 3:05 AM

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : జిల్లాలోని వర్ని అటవీ రేంజ్‌ పరిధిలో ఉన్న చందూర్‌, మోస్రా, నిజామాబాద్‌ సౌత్‌ రేంజ్‌లోని కాల్పోల్‌, మంచిప్ప ప్రాంతాలతోపాటు మోపాల్‌, ఇందల్‌వాయి అటవీ రేంజ్‌ పరిధిలో విచ్చలవిడిగా అటవీ భూముల ఆక్రమణలు కొనసాగుతున్నాయి. సిరికొండ ఫారెస్ట్‌ రేంజ్‌ పరిధిలోని రావుట్ల సెక్షన్‌లో అటవీ భూముల ఆక్రమణపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది. అటవీ భూములను సంరక్షించాలని డిమాండ్‌ చేస్తూ ఇటీవల కలెక్టరేట్‌ ఎదుట గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. ఈ నేపథ్యంలో రావుట్ల సెక్షన్‌లో ఆక్రమణకు గురైన భూములను స్వాధీనం చేసుకునేందుకు అటవీ అధికారులు బుధవారం రంగంలోకి దిగి ఆపరేషన్‌ను పూర్తి చేశారు. ఉద్రిక్తతకు అవకాశం లేకుండా ఏకంగా 200 మందికిపైగా పోలీసులు, అటవీశాఖ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. 55 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని అటవీ కందకాలను ఏర్పాటుచేశారు. ప్రస్తుతం రావుట్ల సెక్షన్‌ పరిధిలో ఆక్రమణలపై దృష్టి సారించి చర్యలు తీసుకున్న అధికారులు జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో భూముల సంరక్షణకు ఏ విధంగా ముందుకు వెళ్తారనేదానిపై చర్చ సాగుతోంది.

అధికారుల కుమ్మక్కుతో..

రావుట్ల సెక్షన్‌ పరిధిలో అటవీ భూముల ఆక్రమణల వెనుక స్థానిక అటవీ అధికారుల పాత్ర ఉందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఎకరం, రెండు ఎకరాల చొప్పున పోడు భూములు ఉన్న రైతులకు సరిహద్దులోని మరింత భూమిని ఆక్రమించేందుకు ప్రోత్సహించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం అందినకాడికి దండుకుని బోర్లు తవ్వి విద్యుత్‌మోటార్లు ఏర్పాటు చేసుకునేందు అనధికార అనుమతులు ఇచ్చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాంతానికే చెందిన పోలీసు సిబ్బందిలో ఒకరు అటవీ అధికారులతో కుమ్మకై ్క పెద్ద ఎత్తున అటవీ భూముల ఆక్రమణలు ప్రోత్సహించారని ఫిర్యాదులు అందాయి. ఇప్పటికే కమ్మర్‌పల్లి అటవీ రేంజ్‌ భీమ్‌గల్‌ మండల పరిధిలో అటవీ భూముల ఆక్రమణలను ప్రోత్సహించినందుకు అటవీ శాఖ అధికారిపై విజిలెన్స్‌ విచారణ కొనసాగుతోంది.

అటవీ భూముల రక్షణకే చర్యలు..

అటవీ భూముల్లో అక్రమంగా సాగుచేసుకుంటున్న, ఆక్రమణలపైనే చర్యలు తీసుకుంటున్నాం. సిరికొండ మండలంలోని రావుట్ల రేంజ్‌లో ఇప్పటికే 55 ఎకరాల వరకు స్వాధీనం చేసుకున్నాం. ఈ మేరకు అటవీ భూముల్లో యంత్రాలతో ట్రెంచింగ్‌ పనులు పూర్తిచేశాం. పట్టా పాస్‌బుక్కులు, పోడు హక్కులు లేని భూముల్లోనే కందకాల తవ్వకం చేపట్టాం.

– చంద్రశేఖర్‌రావు, ఎఫ్‌డీవో, ఆర్మూర్‌

ఏళ్లుగా సాగులో ఉన్నాం..

మేం పదేళ్లకు పైగా భూమిని సాగు చేసుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో సాగుచేసుకున్నవి కావు. ఈ ఎకరం తప్ప మాకు ఎక్కడా భూమి లేదు. ఏళ్లుగా ఈ భూమినే నమ్ము కుని బతుకుతున్నాం. అటవీ అధి కారులు బుధవారం ఉన్న భూమిని లాక్కోవడంతో మాకు జీవనోపాధి లేకుండా పోయింది. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుని, మాకు హక్కులు కల్పించాలి.

– రంగయ్య, జంగిలోడి తండా, సిరికొండ మండలం

యథేచ్ఛగా అటవీ భూముల కబ్జా

సంరక్షణకు చర్యలు చేపడుతున్న

ఫారెస్ట్‌ అధికారులు

సిరికొండ రేంజ్‌ రావుట్ల సెక్షన్‌లో

55 ఎకరాల భూమి స్వాధీనం

జిల్లాలోని మిగతా చోట్ల

ఆక్రమణలపైనా చర్యలుంటాయా?

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement