వేల్పూర్: సీఎం రేవంత్‌రెడ్డిని రైతులు ఎందుకు ఆశీర్వదించాలని.. రుణమాఫీ చేయనందుకా, రైతుబంధు ఎగ్గొట్టినందుకా, యూరియా ఇవ్వనందుకా? దేనికి రైతులు ఆశీర్వదించాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. వేల్పూర్ మండల కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి రోజు రోజుకు దారుణంగా మారుతుంటే సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం కేవలం ప్రచార ఆర్భాటాలకే పరిమితమయ్యారని విమర్శించారు. శిల్పకళా వేదికలో మంగళవారం నిర్వహించింది రైతుల ఆశీర్వాద సభ కాదని, అది శాపనార్ధాల సభ అని ఎద్దేవా చేశారు. ఏ ఒక్క హామీనైనా సంపూర్ణంగా అమలు చేయకపోవడం మాట తప్పడం కాదా అని నిలదీశారు. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఎలాంటి ఆర్భాటాలు, వృథా ఖర్చులు లేకుండా కేవలం ఒక్క ప్రెస్‌మీట్ ద్వారా 11 సీజన్‌లలో రూ.73 వేల కోట్ల రైతుబంధు నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారని గుర్తు చేశారు. నాయకులు రేగుంట దేవేందర్, జైడి నాగధర్‌రెడ్డి, కల్లెడ ఏలియా, ఆర్మూర్ మహేశ్, బద్దం చిన్నారెడ్డి, రేగుల్ల రాములు, బద్దం అశోక్, కుంట ప్రతాప్‌రెడ్డి, పవన్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.


