మాచారెడ్డి: మద్యం మత్తులో కల్లుసీసాతో ఓ యువకుడిపై మరో యువకుడు దాడి చేసిన ఘటన మంగళవారం రాత్రి పాల్వంచ మండలం ఫరీద్‌పేట గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై అనిల్ తెలిపిన ప్రకారం.. ఫరీద్‌పేట గ్రామానికి చెందిన శ్రీకాంత్, నరేందర్ దోమకొండ మండలం అంబారీపేట్ మైసమ్మ ఆలయం వద్ద విందులో పాల్గొన్నారు. మధ్యలో ఇద్దరు గొడవపడి ఎవరి దారినవారు ఇంటికి వెళ్లారు. అదే రోజు రాత్రి కల్లు దుకాణం వద్ద శ్రీకాంత్‌ను పిలిచిన నరేందర్ అంబారీపేటలో జరిగిన గొడవను దృష్టిలో పెట్టుకొని కల్లు సీసాతో దాడి చేశాడు. దీంతో శ్రీకాంత్ మెడ, పొట్టపై తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు వెంటనే శ్రీకాంత్‌ను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.


