తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 4 నుంచి 13 వరకు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ (ఐఎంబీఏ) ఆరో సెమిస్టర్ థియరీ రెగ్యులర్ పరీక్షలు జరుగుతాయని పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కే సంపత్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు.
కొనసాగుతున్న బీఈడీ,
బీపెడ్ పరీక్షలు
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న బీఈడీ, బీపెడ్ నాలుగవ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగినట్లు వర్సిటీ అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. పరీక్షలకు 1,354 మంది విద్యార్థులకు 1,330 మంది హాజరుకాగా 24మంది గైర్హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు.
ఖలీల్‌వాడి: విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ‘అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం’ ద్వారా షెడ్యూల్డ్ కులానికి చెందిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 20 లక్షలు స్కాలర్‌షిప్ అందిస్తున్నట్లు జిల్లా ఎస్సీ వేల్ఫేర్ ఆఫీసర్ రజిత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత గల విద్యార్థులు ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు జిల్లాలోని ఎస్సీ కులానికి చెందిన వారై ఉండాలని, సంవత్సర ఆదాయం రూ. 5 లక్షలకు మించకూడదని, గ్రాడ్యుయేషన్‌లో 60 శాతం కన్నా ఎక్కువ మార్కులు వచ్చి, టోఫెల్, ఈలెట్స్, జీఆర్‌ఈ, జీమెట్‌లో ఎక్కువ శాతం అర్హత కలిగి ఉండాలన్నారు. ఒక్క కుటుంబం నుంచి ఒకరు మాత్రమే ఈ పథకానికి అర్హులని తెలిపారు.
నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ రీజినల్ ఇంటెలిజెన్స్ ఆఫీస్‌లో పనిచేసి ఉద్యోగ విరమ ణ పొందిన పలువురిని అధికారులు సన్మానించారు. కామారెడ్డి జోనల్ ఇన్‌స్పెక్టర్ మొయినుద్దీన్, ఏఎస్సై వడ్ల బ్రహ్మం, హోంగార్డు చక్రధర్ బుధవారం ఉద్యోగ విరమణ చేశారు. నిజామాబాద్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రీజినల్ ఇంటెలిజెన్స్ అధికారి రఘుచందర్,జోనల్ ఇన్‌స్పెక్టర్ సాజిద్, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సంజీవ్ రావు, ఇతర సిబ్బంది వారికి శాలువా, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కామారెడ్డి, నిజామాబాద్ ఇంటెలిజెన్స్ సిబ్బంది పాల్గొన్నారు.
పెర్కిట్(ఆర్మూర్): ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందజేస్తున్న ఉచిత వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యారోగ్య శాఖా ధికారిణి రాజశ్రీ సూచించారు. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లిలో ఉన్న బస్తీ దవాఖాను డీఎంహెచ్‌వో బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుతున్నాయన్నారు. అనంతరం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్య సిబ్బంది డీఎంహెచ్‌వో రాజశ్రీతోపాటు డిప్యూటీ డీఎంహెచ్‌వో రవీందర్, వైద్యాధికారిణి శ్రేయను ఘనంగా సన్మానించారు. వైద్య సిబ్బంది కృష్ణమూర్తి, సాయి, శంకర్, దత్తాత్రి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


