ప్రతి వ్యక్తిలో ప్రతిభ దాగి ఉంటుంది
● దాదాపు 75కి పైగా పాటలు
పాడిన గాయకుడు
● అవార్డులు, పురస్కారాలతో
సత్కరించిన పలువురు
నిజామాబాద్ రూరల్: సాధారణంగా గాయకులు పాటలను ఆలపిస్తారు. కానీ ఒక పాటను మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకు రివర్స్‌లో, అదే లయ, అదే భావంతో ఆలపించడం అత్యంత అరుదైన కళ. అలాంటి కళలో నిజామాబాద్‌లోని వినాయక్ నగర్‌కు చెందిన నవీన్ విశిష్ట ప్రతిభతో జాతీయ స్థాయిలో గుర్తింపుపొందాడు. రివర్స్ గేర్ నవీన్ ప్రాచుర్యం పొందాడు.
‘నీలి నీలి ఆకాశం’ పాట, ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని ‘పొలంగట్టు దుమ్ములోన’, మగధీరలోని ‘పంచదార బొమ్మ’, రంగస్థలంలోని ‘రంగమ్మ మంగమ్మ’, వంటి పాటలను రివర్స్‌లో ఆలపించి విశేష ఆదరణ పొందారు. హిందీలో ‘కజరారే’, ‘ఖైకే పాన్ బనారస్ వాలా’ వంటి పాటలను సైతం అద్భుతంగా ఆలపించి శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు.
భాషపై పట్టు..
ఇది కేవలం వినోదం కాదు. అపారమైన జ్ఞాపకశక్తి, భాషపై పట్టు, సంగీతంపై అవగాహన, గంటల తరబడి సాధన ఉంటేనే సాధ్యమయ్యే కళ. పలు టెలివిజన్ ఛానళ్లలో తన ప్రతిభను ప్రదర్శించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
కళారంగంతోపాటు విద్యారంగం..
కళాకారుడిగానే కాకుండా జిల్లా కేంద్రంలోని కాకతీయ విద్యాసంస్థల్లో గణితశాస్త్ర ఉపాధ్యాయుడిగా వేలాది మంది విద్యార్థులకు మార్గదర్శకుడిగా నిలుస్తున్నారు. రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకోవడం ఆయన విద్యాసేవలకు నిదర్శనం. అదేవిధంగా భగవద్గీత ప్రవచనకర్తగా, యోగ ప్రచారకుడిగా సమాజంలో విలువలను పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. నవీన్ కుమార్‌కు ఇటీవల ప్రొఫెసర్ జయశంకర్ ఆచార్య విశ్వకీర్తి–విశ్వస్ఫూర్తి పురస్కారం లభించింది. నేషనల్ ప్రీమియర్ అవార్డ్స్ 2021–22, 2023–24,2024–25లో అందుకున్నారు. 32 సార్లు ఉగాది పురస్కారాల గ్రహీత, అలాగే స్టేట్ లెవెల్ బెస్ట్ టీచర్ అవార్డు 2025 పొందారు. 80కి పైగా కవి సమ్మేళనాలలో సన్మానాలు పొందారు.
ప్రతి వ్యక్తిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. ప్రతిభను వెలికితీసిన ప్పుడే వ్యక్తి గొప్పదనం బయటపడుతుంది. అప్పుడే సమాజంలో ఆ వ్యక్తి ఉన్నతంగా, ఆదర్శంగా నిలుస్తాడు. అలాగే జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడతాడు. ప్రతిభ అనేది ఎవ్వరి సొత్తుకాదు. ప్రయత్నిస్తే ప్రపంచంలో ఏ పని అయినా సులభంగా చేయగలం.
– నవీన్, నిజామాబాద్


