నిజామాబాద్ అర్బన్/నందిపేట్(ఆర్మూర్) : బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని కలలు కంటోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ ఎద్దేవా చేశారు. బీజేపీ ఇతర పార్టీలతో కలిసి పోటీ చేసినా గెలువదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఒకటి, రెండు సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందన్నారు. సర్ పేరిట బీజేపీ కుట్రలు, కుతంత్రాలను తెలంగాణలో సాగనివ్వమన్నారు. ఓట్ల చోరీని అడ్డుకుంటామన్నారు. సోమవారం మహేశ్ గౌడ్ నిజామాబాద్‌లో ఒలింపిక్ సంఘం నిర్వహించిన కార్యక్రమంలో, నందిపేటలో టీపీసీసీ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) పై బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్‌ఏలు) అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి అర్హుడైన ఓటరు పేరు నమోదు చేయడంతో పాటు అనర్హుల పేర్లు తొలగించేలా బీఎల్‌ఏలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. కేటీఆర్ హరీశ్‌రావులు కాంగ్రెస్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పది సంవత్సరాల్లో చేయని అభివృద్ధిని రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చేసి చూపించిందన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రైతులు, పేద ప్రజల నడ్డి విరిచి ఎరువులు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిందని విమర్శించారు. అయోధ్య పై కోట్ల వ్యాపారం చేసిందని బీజేపీని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు కలిసి వచ్చినా కాంగ్రెస్ పార్టీదే అధికారం అని ధీమా వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్‌కు తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మట్లాడుతూ.. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి దేశ నిర్మాణంలో యువతను భాగస్వాములుగా చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు దానికి భిన్నంగా బీజేపీ రాజ్యాంగం కల్పించిన హక్కును తొలగిస్తోందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి, మేయర్ ఉమారాణి, డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, నాయకులు వినయ్ రెడ్డి, సునీల్ రెడ్డి, తాహెర్ బిన్ హందాన్, కేశ వేణు, మానాల మోహన్ రెడ్డి, అరికెల నర్సారెడ్డి, కవితా రెడ్డి, ఆకుల లలిత, శేఖర్ గౌడ్, రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, స్థానిక సర్పంచ్ ఎర్రం లింగం, మండల పార్టీ అధ్యక్షుడు దూడ వెంకటేష్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్
అర్హుడైన ప్రతి ఓటరు పేరు
జాబితాలో చేర్చాలి
టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ
మహేశ్ కుమార్ గౌడ్


