ప్రతి ఓటరుకు ఎన్యుమరేషన్‌ ఫారాలు అందించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతి ఓటరుకు ఎన్యుమరేషన్‌ ఫారాలు అందించాలి

Jun 30 2026 1:24 AM | Updated on Jun 30 2026 1:24 AM

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి

నిజామాబాద్‌ అర్బన్‌ : భారత ఎన్నికల సంఘం నిర్దేశిత కార్యాచరణ ప్రకారం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి అన్నారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఈఆర్‌వోలు, ఎఈఆర్‌వోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీ, సేకరణ, వివరాల నమోదు ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలన్నారు. జూలై 24 వరకు ఇంటింటి సర్వే నిర్వహించి అర్హులైన ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్‌ ఫారాలను పంపిణీ చేసి, పూరించిన తర్వాత సేకరించాలని, ఫారాల పంపిణీ ప్రక్రియను జూలై 1 నాటికి పూర్తి చేసి ప్రతి రోజూ పురోగతి నివేదికలను సమర్పించాలన్నారు. అనంతరం కలెక్టర్‌ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, జిల్లాలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటికే 72 శాతం ఎన్యూమరేషన్‌ ఫారంల పంపిణీ పూర్తయ్యిందన్నారు. జిల్లాలో మొత్తం 14,39,734 మంది ఓటర్లకు గాను 10,33,033 మంది ఓటర్లకు ఫారాల పంపిణీ జరిగిందని, మరో రెండు మూడు రోజులలో మిగతా 4,06,701 మంది ఓటర్లకు కూడా ఫారాలు పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అర్బన్‌ ఏరియాలోనూ ఎస్‌ఐఆర్‌ అమలును వేగవంతం చేస్తామన్నారు. బీఎల్‌వో లు ఇంటింటికి తిరిగి ఫారంలు అందజేస్తున్నారని, ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరుపుతున్నారని అన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో, బీఎల్‌ఏలతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వీసీలో అదనపు కలెక్టర్‌ వి భుజంగరావు, ఆర్మూర్‌ సబ్‌ కలెక్టర్‌ అభిగ్యాన్‌ మాల్వియ, నగర పాలక సంస్థ కమిషనర్‌ దిలీప్‌ కుమార్‌, బోధన్‌ ఆర్డీవో విజయలక్ష్మి, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement