నిజామాబాద్ అర్బన్ : పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ ప్రజావాణిలో సీపీ సాయిచైతన్య 39 ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను సీపీ ఆదేశించారు.
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్/మే 2026లో జరిగిన డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్ బ్యాక్‌లాగ్ థియరీ పరీక్షల రీవాల్యుయేషన్ దరఖాస్తుల స్వీకరణకు జూలై 8వ తేదీ తుది గడువుగా కంట్రోలర్ ప్రొఫెసర్ కే సంపత్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రీవాల్యుయేషన్ ఫీజు ఒక్కో పేపర్‌కు రూ.500, ధరఖాస్తు ఫారానికి రూ.25లు చెల్లించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు త మ కళాశాలలో రీవాల్యుయేషన్ ఫారాలు పొంది, మార్కుల మెమో జిరాక్స్ జతచేసి నిర్ణీత ఫీజుతో సమర్పించాలని సూచించారు. ఈ అవకాశాన్ని 2021, 2022, 2023, 2024, 2025 బ్యాచ్‌ల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ, బీపెడ్ 4వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు సోమవారం ప్రారంభమైనట్లు అ కడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. మొత్తం 1,354 మంది విద్యార్థులకు 1,229 మంది హాజరు కాగా 125 మంది గైర్హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు.
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ అధికారులు డిగ్రీ విద్యార్థుల వద్ద అడ్మిషన్ రోజే ఫీజు కట్టించుకోవడం సిగ్గుచేటని ఏబీవీపీ ఇందూరు జిల్లా కన్వీనర్ అక్షయ్ విమర్శించారు. సోమవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో తెయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఛాంబర్ ఎదుట బైఠాయించి నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా అక్షయ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ జీవో ప్రకారం విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేశాక వారం రోజుల్లోపు ఫీజులు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. దోస్త్ అలాట్‌మెంట్ ఆర్డర్‌లో పొందుపర్చిన నిబంధనలను వర్సిటీ అధికారులు పరిగణలోకి తీసుకుని విద్యార్థుల నుంచి ఒక్క రూపాయి వసూలు చేయవద్దని డిమాండ్ చేశారు. లేదంటే ఏబీవీపీ ఆధ్వర్యంలో అందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. వర్సిటీ ఏబీవీపీ కార్యదర్శి సమీర్, ప్రాంత వనవాసి కన్వీనర్ అశోక్, నాయకులు శివ, మనోజ్, భార్గవ్, దుర్గ దాస్, విజయ్, విద్యార్థులు పాల్గొన్నారు.


