మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలి

Jun 30 2026 1:18 AM | Updated on Jun 30 2026 1:18 AM

టీపీసీసీ అధ్యక్షుడు,

ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌

నగరంలో ఒలింపిక్‌ డే రన్‌

నిజామాబాద్‌ అర్బన్‌: యువత క్రీడల్లో పాల్గొని మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌ పేర్కొన్నారు. జిల్లా ఒలింపిక్‌ సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఒలింపిక్‌ డే రన్‌లో ఆయన పాల్గొన్నారు. పాత కలెక్టరేట్‌ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఒలింపిక్‌ క్రీడల స్ఫూర్తి అయిన క్రమశిక్షణ, ఐక్యత, శాంతి, ఆరోగ్యకర జీవన విధానాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి, దేశానికి కీర్తి తీసుకురావాలని పిలుపునిచ్చారు. క్రీడాకారులను ప్రోత్సహించడంలో జిల్లా ఒలింపిక్‌ సంఘం చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. అంతకుముందు ఆర్‌ఆర్‌ చౌరస్తాలో ఒలింపిక్‌ డే రన్‌ను అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో క్రీడాకారులకు వసతులు లేకున్నా ఆయా క్రీడాంశాల్లో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారన్నారు. ఒలింపిక్స్‌ అంటే కేవలం క్రీడలు మాత్రమే కాదని, ప్రపంచ దేశాల మధ్య స్నేహం, శాంతి, బాధ్యతకు ప్రతీక అన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలికి క్రీడలు ఎంతో అవసరమన్నారు. జిల్లాలో సరైన సౌకర్యాలు లేవని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి స్టేడియం నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇప్పటికే అనేకసార్లు మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు. కార్యక్రమంలో నగర మేయర్‌ కూరగాయల ఉమారాణి, ఒలింపిక్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు భక్తవత్సలం, బొబ్బిలి నరసయ్య, క్రీడా సంఘాల ప్రతినిధులు, బీజేపీ కార్పొరేటర్లు నాగోల లక్ష్మీనారాయణ, బట్టు రాఘవేందర్‌, మల్కాయి మహేందర్‌, జ్యోతి మురళి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement