ఎల్లారెడ్డిరూరల్: చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ జాలరి గల్లంతైన సంఘటన ఎల్లారెడ్డి మున్సిపాలిటి పరిధిలోని పోసాన్‌పల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా .. పోసాన్‌పల్లికి చెందిన బేస్త సాయిలు(58) ఆదివారం చేపలు పట్టేందుకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. అతడు తిరిగి రాకపోవడంతో సాయిలు కుటుంబ సభ్యులు గ్రామ శివారులోని ముర్సుకుంట వద్ద గాలించారు. కుంట ఒడ్డున సాయిలు దుస్తులు, చెప్పులు కనిపించాయి. వెంటనే అగ్నిమాపకశాఖ సిబ్బందితోపాటు పోలీసులకు సమాచారం అందించారు. సిబ్బంది ఎంత వెతికినప్పటికి సాయిలు ఆచూకీ తెలియరాలేదు. చీకటి పడడంతో గాలింపు చర్యలను నిలిపి వేశారు. సాయిలు గల్లంతు కావడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
నిజామాబాద్ అర్బన్: నగరంలోని కసాబ్‌గల్లీలో చరణ్, శ్రీనివాస్ అనే వ్యక్తులు పక్కపక్కనే నివాసం ఉంటున్నారు. ఇరువురి మధ్య బైక్ పార్కింగ్ విషయమై శనివారం రాత్రి గొడవ జరిగింది. ఫిర్యాదు మేరకు ఇద్దరిపై ఆదివారం కేసు నమోదు చేశామని రెండో టౌన్ ఎస్సై యాదగిరగౌడ్ తెలిపారు.
కమ్మర్‌పల్లి: కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ 1995–96 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్ పూర్వ విద్యా ర్థులు తమ తోటి విద్యార్థి ఎం.డీ యూసుఫ్‌ఖాన్ అనారోగ్యంతో బాధపడుతుండడంతో వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు. ఆదివారం యూసుఫ్‌ఖాన్ ఇంటికి వెళ్లి రూ. 40 వేలు ఆర్థిక సహాయం అందజేశారు.


