ఆర్మూర్: మృగశిర కార్తె మొదలై 20 రోజులు దా టింది. ఆకాశం మబ్బు పట్టి మొండికేసింది. వాన కురవనంటోంది. దుక్కి దున్నిన నేల నెర్రెలు బారింది. రైతు గుండె చెరువైంది. ఎల్‌నినో ప్రభావమని వాతావరణ శాఖ చెప్తున్నా పల్లె జనం మాత్రం తమకు తెలిసిన భాషలో వాన దేవుడికి విన్నపాలు పంపుతున్నారు. ‘త్వరగా రా వాన దేవుడా.. నీవు వస్తేనే పుష్కలంగా పంటలు పండుతాయి.. మా పొట్టలు నిండుతాయని పాటల రూపంలో వేడుకుంటున్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వర్షాల కోసం కప్పల పెళ్లి, గ్రామ దేవతలకు జలాభిషేకాలు నిర్వహిస్తున్నారు.
101 బిందెల కన్నీరు..
వేల్పూర్ మండలం పడగల్‌లో గోదావరి జలాలతో గంగపుత్రులు గ్రామ దేవతలకు అభిషేకాలు చేశా రు. కమ్మర్‌పల్లి మండలం ఉప్లూర్‌లో గ్రామస్తులు 101 బిందెలతో గ్రామదేవతల గుడికి చేరారు. ‘‘అమ్మా, నీ కాళ్లు కడుగుతున్నాం. మా కన్నీళ్లు తుడువమ్మా’’ అనే ఆర్తనాదం. జలా భిషేకం తర్వా త ఉప్పు, మిరపకాయలు పోసి ‘‘మా బతుకులు ఉప్పగా, కారంగా అయిపోయినయ్. తీపి చేయ మ్మా’’ అని మొక్కుకున్నారు. ‘‘గతేడాది ఇలాగే చేస్తే మూడు రోజులకు కుండపోత వాన పడింది’’ అని 60 ఏళ్ల నర్సయ్య నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
‘పల్లె’ జనం విన్నపాలు
కప్పల పెళ్లిళ్లు, గ్రామ దేవతలకు
జలాభిషేకాలు
జూన్ ముగిసినా కురవని వర్షాలు..
ఆందోళనలో రైతన్నలు


