లీకేజీనా? మాస్‌ కాపీయింగా? | - | Sakshi
Sakshi News home page

లీకేజీనా? మాస్‌ కాపీయింగా?

Mar 20 2026 7:56 AM | Updated on Mar 20 2026 7:56 AM

అరగంటలోనే పదో తరగతి

ప్రశ్నపత్రం బయటకు..

తొమ్మిది మంది టీచర్ల సస్పెన్షన్‌

వంద శాతం రిజల్ట్‌ కోసమే వ్యవహారం

ఖలీల్‌వాడి: పదో తరగతి పరీక్ష మొదలైన అర గంటలోనే జిల్లాలో ప్రశ్నపత్రం బయటకు రావడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. బుధవారం జరిగిన తెలుగు, హిందీ పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాలను సెంటర్‌లో పనిచేసే సిబ్బంది వాట్సాప్‌ ద్వారా బయటికి పంపించి సమాధానాలు తెప్పించారు. ప్రశ్నపత్రం కాస్తా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టడంతో విషయం తెలిసిన విద్యాశాఖ అధికారులు ఘటనకు సంబంధించిన తొమ్మిది మంది సిబ్బందిపై వేటు వేశారు. అయితే, ఇదంతా పదో తరగతి పరీక్షల్లో వందశాతం రిజల్ట్‌, ఉన్నత కళాశాలల్లో సీట్ల కోసమే జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

నిబంధనలు కఠినమైనా పేపర్‌ బయటికి..

జిల్లాలోని 642 ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు చెందిన 24,361 మంది, ఏడుగురు ప్రయివేట్‌ విద్యార్థులు 144 కేంద్రాల్లో పరీక్షలు రాస్తున్నారు. కేంద్రాల్లో పనిచేసే సిబ్బందితోపాటు చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్‌, తనిఖీలకు వెళ్లే సిబ్బందికి సైతం సెల్‌ఫోన్ల వినియోగానికి అనుమతి లేదు. ఇంత పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారుల ఆదేశాలున్నా.. ప్రశ్నపత్రం బయటికి వెళ్లడం, సమాధానాలు రావడం అనుమానాలకు తావిస్తోంది. సెంటర్‌లోని సిబ్బంది ప్రశ్నపత్రాన్ని బయట వ్యక్తులకు అందించారా? లేక టీచర్ల ఫోన్లకే పంపించారా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ప్రశ్నపత్రాన్ని బయటకు పంపిన వారితోపాటు బయట ఫోన్‌కు వెళ్లిన వ్యక్తులపై సైతం విద్యాశాఖ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీనిపై ఇంటెలిజెన్స్‌ అధికారులు విచారణ చేపడుతున్నట్లు సమాచారం.

పరస్పర సహకారం

పదో తరగతిలో ప్రభుత్వ, ప్రయివేట్‌, గురుకుల, మోడల్‌, కేజీబీవీ పాఠశాల్లో 100 శాతం ఉత్తీర్ణత కోసం అక్కడ పనిచేసే సిబ్బంది ద్వారా మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రయివేటు పాఠశాలలు ఉత్తీర్ణత శాతం, గ్రేడ్‌లను ప్రచారం చేసుకునేందుకు పరీక్ష కేంద్రానికి సంబంధించిన పాఠశాల వారితో పరస్పర సహకారం తీసుకుంటున్నట్లు సమాచారం. కొన్ని ప్రభుత్వ పాఠశాలలు ట్రిపుల్‌ ఐటీ సీట్ల కోసం మాస్‌ కాపీయింగ్‌ చేయిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు మారుమూల ప్రాంతాల్లోని పరీక్ష కేంద్రాలపై సరైన నిఘా లేకపోవడంతో అక్కడ మాస్‌కాపీయింగ్‌ జరిగేందుకు ఆస్కారం ఉంటోంది. తనిఖీ చేసే బృందాలు సైతం ముందస్తు సమాచారం అందించడంతో విద్యార్థుల వద్ద చిట్టీలు దొరక్కుండా అక్కడి సిబ్బంది జాగ్రత్తలు పడుతున్నట్లు సమాచారం. అయితే, మాస్‌ కాపీయింగ్‌ వ్యవహారంతో మెరిట్‌ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కలెక్టర్‌ ఆగ్రహం

పదో తరగతి పరీక్షలో పేపర్‌ బయటికి రావడంపై కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. డీఈవో అశోక్‌కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్ట్‌మెంటల్‌ అధికారులపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో సోమవారం జరిగే పరీక్షకు విద్యాశాఖ పకడ్బందీ చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది.

ఇద్దరు టీచర్లపై సస్పెషన్‌ ఎత్తివేత

ఖలీల్‌వాడి: పదో తరగతి పరీక్షల్లో భాగంగా బోధన్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల సెంటర్‌లో ప్రశ్నపత్రం వైరల్‌ అయిన ఘటనలో ఇద్దరు టీచర్లపై సస్పెన్షన్‌ ఎత్తివేసినట్లు డీఈవో పార్శి అశోక్‌ తెలిపారు. గురువారం అధికారుల విచారణలో అవాస్తవమని తేలిందన్నారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు సంబంధిత చీఫ్‌ సూపరింటెండెంట్‌ అయిన పెంటాకలాన్‌ జడ్పీ హైస్కూల్‌ టీచర్‌ వేణు, కల్దుర్కి జడ్పీ హైస్కూల్‌ టీచర్‌ శివానందరావుపై ఉన్న సస్పెన్షన్‌ ఎత్తివేసినట్లు పేర్కొన్నారు.

ప్రశ్నపత్రం లీక్‌ కాలేదు

డీఈవో అశోక్‌ కుమార్‌ ప్రకటన

మాల్‌ ప్రాక్టీస్‌ కోసం

ప్రయత్నించారని వెల్లడి

ఖలీల్‌వాడి: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో భాగంగా ఈ నెల 18న జరిగిన హిందీ, తెలుగు పరీక్ష పేపర్లు లీక్‌ కాలేదని డీఈవో పార్శి అశోక్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం మధ్యా హ్నం 12.15 గంటలకు డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ ద్వారా బోధన్‌ పరిధిలో తెలుగు ప్రశ్నపత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నట్లు సమాచారం అందినట్లు పేర్కొన్నారు. దీంతో సంబంధిత అధికారులైన బోధన్‌ ఎంఈవో, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ సిబ్బందితో విచారణ చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. మధ్యాహ్నం 1.30 గంటలకు డైరెక్టర్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎగ్జామినేషన్‌ నుంచి ఫోన్‌ ద్వారా సమాచారం రావడంతో సంబంధిత అధికారుల విచారణ నివేదికను కలెక్టర్‌కు అందించినట్లు తెలిపారు. వారి ఆదేశాల మేరకు ఘటనకు సంబంధించిన సిబ్బందిని వెంటనే విధుల నుంచి సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు. జడ్పీ హైస్కూల్‌ ఆలూరు, మెండోరా సెంటర్‌లో పేపర్‌ లీకేజీ కాదని, అక్కడ పనిచేస్తున్న కొంతమంది ఇన్విజిలేటర్లు మాల్‌ప్రాక్టీసు కోసం ప్రయత్నాలు చేశారని విచారణలో తేలిందన్నారు. దీంతో వారిని సస్పెండ్‌ చేసినట్లు పేర్కొన్నారు. రెండు సెంటర్లలో జరిగిన ప్రక్రియ పేపర్‌ లీకేజీ కాదని, వాళ్లు మాల్‌ ప్రాక్టీస్‌ చేసేందుకు చేసిన ప్రయత్నంగా నిర్ధారించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement