బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందినట్లు సీఐ శ్రీధర్ తెలిపారు. వివరాలు ఇలా.. సంగారెడ్డి జిల్లా కల్హెర్ మండలం బీబీపేటకు చెందిన పల్లపు రవి(26) కొన్నేళ్లుగా బాన్సువాడలోని దాల్మల్‌గుట్టలో నివాసం ఉంటున్నాడు. బుధవారం రాత్రి పని నిమిత్తం అతడు తాడ్కోల్ రోడ్డు నుంచి గౌలీగూడ వైపు ఎక్స్‌ఎల్‌పై బయలుదేరాడు. రోడ్డు దాటుతుండగా బొలెరో వాహనం అతివేగంగా వచ్చి అతడిని ఢీకొట్టింది. ఈ ఘటనలో రవికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ తెలిపారు.
బోధన్‌రూరల్: సాలూర శివారులోని మంజీర నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్నట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి గురువారం తెలిపారు. పట్టుబడిన ట్రాక్టర్‌ను బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఆయన వివరించారు.
నిజామాబాద్ రూరల్: మద్యం తాగి ఆటో నడిపిన వ్యక్తిపై డ్రంకెన్‌డ్రైవ్ కేసు నమోదు చేసినట్లు మోపాల్ ఎస్సై సుష్మిత గురువారం తెలిపారు. సిర్‌పూర్ తండాకు చెందిన సురేష్ అనే యువకుడు ఆటోలో ప్రయాణికులను ఎక్కించుకొని, మద్యం మత్తులో నిజామబాద్ వైపు బయలుదేరాడు. మోపాల్ శివారులో పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా ఆటో డ్రైవర్ సురేష్ ఆటో నిలుపకుండా అతివేగంగా నడపడంతో ఏఎస్సైకి గాయమైంది. వెంటనే పోలీసులు ఆటో డ్రైవర్‌ను వెంబడించగా అతను మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. అలాగే ప్రయాణికులతో, పోలీసు వారిపై తిరగబడ్డాడు. దీంతో అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఆమె తెలిపారు.
నిజామాబాద్ అర్బన్: నగరంలోని కుమార్‌గల్లిలో చోరీకి యత్నించిన ఓ వ్యక్తిని స్థానికులు పట్టుకొని, పోలీసులకు అప్పగించారు. వివరాలు ఇలా.. నగరానికి చెందిన గంగాప్రసాద్ అనే వ్యక్తి బుధవారం రాత్రి కుమార్‌గల్లిలోని ఓ ఇంటిలో చోరీకి యత్నించాడు. ఈక్రమంలో ఇంట్లోని వృద్ధురాలు అతడిని చూసి కేకలు వేసింది. వెంటనే స్థానికులు అప్రమత్తమై, అతడిని పట్టుకున్నారు. అనంతరం ఒకటోటౌన్ పోలీసులకు అప్పగించారు. నిందితుడు పాత నేరస్తుడని, కేసు నమోదు చేసినట్లు ఒకటవ టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు.


