నిజామాబాద్ రూరల్: ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న ఉగాది కార్యక్రమం నవభారత నిర్మాణానికి నాందిగా భావిస్తున్నట్లు ఆర్‌ఎస్‌ఎస్ ఇందూరు విభాగ్ ప్రచారక్ నర్రా వెంకట శివకుమార్ తెలిపారు. రానున్నది హిందూ శతాబ్దమేనని ధీమా వ్యక్తం చేశారు. నగరంలోని బస్వ గార్డెన్‌లో గురువారం ఆర్‌ఎస్‌ఎస్ ఇందూరు నగర శాఖ ఆధ్వర్యంలో ఉగాది మహోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ప్రధాన వక్తగా విచ్చేసి, మాట్లాడారు. ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకులైన డాక్టర్ హెడ్గేవార్ జన్మదినం ఉగాది రోజే కావడం స్వయంసేవకులకు ఎంతో ప్రత్యేకమని తెలిపారు. హిందువులు జరుపుకునే ప్రతి పండుగలు ఒక విశేషమైన సందేశాన్ని ఇస్తాయని ఉగాది కూడా నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటూ రాబోయే సంవత్సర కాలం పాటు జీవితంలో ఎదురయ్యే కష్టాలు, సుఖాలు, బాధలు, దుఃఖాలను సమదృష్టితో చూడగలిగే మానసిక స్థితిని నిర్మాణం చేయడం కోసమే ఉగాది పచ్చడిని ఆరు రుచుల సమ్మేళనంగా తయారుచేసి స్వీకరిస్తామని అన్నారు. జనవరి 1 నూతన సంవత్సరం కాదని ఉగాది మాత్రమే నూతన సంవత్సరమని భారతీయులందరూ గ్రహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రకృతికి హాని కలిగే విధంగా ఎలాంటి పనులు చేయవద్దని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నియంత్రించాలన్నారు. సమాజంలో పరివర్తన రావాలనే ఆర్‌ఎస్‌ఎస్ నిరంతరం కృషి చేస్తోందన్నారు. దేశాధినేతల మధ్య ఆధిపత్య పోరు కారణంగానే యుద్ధాలు జరుగుతున్నాయని, మాట్లాడుకుంటే పరిష్కారం కాని సమస్యలు ఏవి ఉండవని తెలిపారు. అందుకే ఆర్‌ఎస్‌ఎస్ కుటుంబ స్థాయి నుంచి మొదలుపెట్టి దేశం మొత్తంలో కలిసి మాట్లాడుకోవడం, కలిసి ఆలోచించడం, కలిసి చర్చించడం వంటి సంస్కారాలను సమాజంలో నింపేందుకు కృషి చేస్తోందని తెలిపారు. దేశంలో మెజారిటీలు హిందువులు కాబట్టే ఇతర మతాల ప్రజలు స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారని అది హిందుత్వం యొక్క స్ఫూర్తి అని స్పష్టం చేశారు. ఈ శతాబ్ది సందర్భంగా హిందూ సమాజం మొత్తాన్ని ధర్మ మార్గం వైపు నడిపించడం కోసం ఏకత్రిత సూత్రంపై నిలబెట్టడం కోసం జన జాగరణ, హిందూ సమ్మేళనాల పేరుతో దేశవ్యాప్తంగా ప్రతి బస్తీలో కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. కార్యక్రమంలో అర్బన్ ఎమ్మె ల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, నగర కార్యవాహ అర్గుల సత్యం, సహకార్యవాహలు సుమిత్ కుమార్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ఉగాదే నూతన సంవత్సరం..
జనవరి 1 కాదు
ఆర్‌ఎస్‌ఎస్ ఇందూరు విభాగ్
ప్రచారక్ నర్రా వెంకట శివకుమార్
నగరంలో ఘనంగా
ఆర్‌ఎస్‌ఎస్ ఉగాది ఉత్సవం


