● విద్యార్థులను తనిఖీ చేసిన అధికారులు
● పరీక్ష కేంద్రాల వద్ద పోలీసుల బందోబస్తు
నిజామాబాద్ రూరల్/ జక్రాన్‌పల్లి/ డిచ్‌పల్లి/ సిరికిండ: నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లో శనివారం పదో తరగతి వార్షిక పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా జరిగాయి. పరీక్ష కేంద్రాలు విద్యార్థులతో సందడిగా మారాయి. పరీక్ష కేంద్రాల వద్ద ఉపాధ్యాయులు, అధికారులు విద్యార్థులను తనిఖీ చేసి లోనికి పంపించారు. పలు మండలాల్లోని పరీక్ష కేంద్రాలను స్థానిక అధికారులు తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రూరల్ మండల పరిధిలోని గుండారం, మూబారక్‌నగర్, వాసవి హైస్కూల్, ఎస్‌కే డీజీ, ఆర్‌బీవీఆర్‌ఆర్, విజయ్ పబ్లిక్ స్కూల్, బ్లూమింగ్ బడ్స్ హైస్కూల్‌లో పదో తరగతి పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎంఈవో సేవ్లా తెలిపారు. రూరల్ పరిధిలో 1772 మందికి 1769 మంది హాజరు కాగా ముగ్గురు విద్యార్థులు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. మోపాల్ మండలంలోని బోర్గాం(పి), న్యాల్‌కల్, కంజర్, మోపాల్, ముదక్‌పల్లి గ్రామాల్లో పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించినట్లు ఎంఈవో సాయిలు తెలిపారు. 1550 మందికి గాను ముగ్గురు విద్యార్థులు గైర్హాజరయ్యారని ఎంఈవో పేర్కొన్నారు. జక్రాన్‌పల్లి మండలంలోని అర్గుల్, జక్రాన్‌పల్లి, పడకల్, తొర్లికొండ జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి పరీక్షలు జరిగాయి. డిచ్‌పల్లి మండలంలో ఏర్పాటు చేసిన 8 పరీక్షా కేంద్రాల్లో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మండలంలో మొత్తం 1427 మందికి 1426 మంది హాజరు కాగా జెడ్పీహెచ్‌ఎస్ మెంట్రాజ్‌పల్లి పరీక్షా కేంద్రంలో ఒక విద్యార్థి గైర్హాజరైనట్లు ఎంఈవో నరేశ్ తెలిపారు. సిరికొండ మండలంలోని నాలుగు పరీక్షా కేంద్రాల్లో 696 మందికి సిరికొండ ప్రభుత్వ ఆదర్శ పాఠశాల కేంద్రంలో ఒక విద్యార్థిని గైర్హాజరైనట్లు ఎంఈవో పుసాల రాములు తెలిపారు.
సిరికొండలో పరీక్ష కేంద్రంలోకి వెళ్తున్న విద్యార్థులు
పడకల్‌లో పరీక్ష కేంద్రంలో విద్యార్థులను తనిఖీ చేస్తున్న ఉపాధ్యాయులు


