ఇబ్బందులు పడుతున్నాం
నిధులు మంజూరు చేయాలి
సిరికొండ: మండలంలో ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన వంతెన పూర్తిగా శిథిలావస్థకు చేరింది. సిరికొండ మండల కేంద్రం నుంచి కామారెడ్డి వెళ్లే మార్గంలో ఉన్న గోప్య తండా వద్ద కొండాపూర్ ఊర చెరువు అలుగు వాగుపై నుంచి ప్రధాన రహదారి వెళ్తుంది. ఈ వాగుపై సుమారు 35 ఏళ్ల క్రితం బండ రాళ్లతో వంతెనను నిర్మించారు. వంతెన నుంచి వాగు బాగా లోతుగా ఉంటుంది. వంతెన నిర్మించి చాలా ఏళ్లు గడుస్తుండటంతో వాగు ప్రవాహానికి వంతెన అడుగు భాగం దెబ్బతింటోంది. వంతెనను నాటి సాంకేతికతకు అనుగుణంగా బండ రాళ్లతో నిర్మించారు. వరద ఉధృతికి ప్రతి ఏటా వంతెన అడుగు భాగంలో కోతకు గురవుతు రాళ్లు పడిపోతున్నాయి. వంతెన పైభాగంలో కూడా స్లాబ్ ధ్వంసమైంది. సిరికొండ మండలంతో పాటు మోర్తాడ్, కమ్మర్‌పల్లి, భీంగల్ మండలాలకు చెందిన ప్రజలు హైదరాబాద్ వెళ్లేందుకు ఈ మార్గాన్నే వినియోగిస్తారు. ఈ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చడంతో నిత్యం వందలాది వాహనాలతో రద్దీగా మారింది. రోడ్డు డబుల్‌గా ఉండి వంతెన సింగిల్ రోడ్డుతో ఉండటంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వంతెనకు ఇరు పక్కల ఉన్న రెయిలింగ్ కూడా దెబ్బతింది. రెయిలింగ్ లేకపోవడంతో రాత్రి వేళలో ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారిపై శిథిలావస్థకు చేరిన వంతెన స్థానంలో నూతన వంతెన నిర్మాణం చేపట్టాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.
కామారెడ్డికి వెళ్లే రోడ్డులో కొండాపూర్ వాగుపై ఉన్న వంతెన పూర్తిగా శిథిలావస్థకు చేరింది. వంతెనపై స్లాబ్ ధ్వంసమై గుంతలు ఏర్పడ్డాయి. రెయిలింగ్ విరిగిపోయింది. వంతెన పైనుంచి ప్రయాణం ప్రమాదకరంగా మారింది. వంతెన శిథిలావస్థకు చేరడంతో ఇబ్బందులు పడుతున్నాం.
– కిరణ్, గ్రామస్తుడు, గడ్కోల్
వంతెనను చాలా ఏళ్ల క్రితం ని ర్మించారు. వంతెన అడుగు భా గంలో రాళ్లు ఊడిపోతున్నా యి. ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితిగా మారింది. ఈ రోడ్డును డబుల్ రోడ్డుగా చేయడంతో రద్దీ ఎక్కువైంది. శిథిలావస్థకు చేరిన వంతెన స్థానంలో నూతన వంతెన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి.
– రహీం, గ్రామస్తుడు, కొండాపూర్
శిథిలావస్థకు చేరిన కొండాపూర్
వంతెనతో అవస్థలు
గోప్యతండా వద్ద
కొన్నేళ్ల క్రితం నిర్మాణం
దెబ్బతిన్న వంతెన అడుగుభాగం
పట్టించుకోని అధికారులు


