గంజాయి విక్రేతల అరెస్ట్
నిజామాబాద్ రూరల్: గంజాయి విక్రేతలను అరెస్టు చేసినట్లు రూరల్ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్ తెలిపారు. రూరల్ ఎస్‌హెచ్‌వో కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్‌హెచ్‌వో నిందితుల వివరాలను వెల్లడించారు. రూరల్ పరిధిలోని ఖానాపూర్ చౌరస్తాలో ఉన్న ఓ టీ దుకాణం వద్ద కొంతమంది వ్యక్తులు గంజాయి కలిగి ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అక్కడ అనుమానాస్పదంగా ఉన్న నేనావత్ మోహన్(గాంధారి), అక్షయ్ (మదన్‌పల్లి), సిద్ధాంత్(అమ్రాద్), సిద్ధార్థ్, ప్రశాంత్(అమ్రాద్)లను అదుపులోకి తీసుకోగా వారి నుంచి 250 గ్రాముల గంజాయి లభ్యమైందని అన్నారు. విచారణలో వారు మహారాష్ట్ర, ఒరిస్సా, పలు ప్రాంతాల నుంచి గంజాయిని కొనుగోలు చేసి జిల్లా కేంద్రంలో ఎక్కువ ధరకు విక్రయిస్టున్నట్లు ఒప్పుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. ఎవరైనా గంజాయి విక్రయిస్తే పోలీసులకు సమాచారం అందించాలని వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని అన్నారు.


