చాన్స్.. ప్లీజ్!
● నామినేటెడ్ పదవుల కోసం ఆశావహుల ప్రయత్నాలు
● మార్చి 15లోగా పదవుల
పంపకాలు పూర్తిచేసేందుకు
కాంగ్రెస్ నాయకత్వం గ్రీన్‌సిగ్నల్
● సహకార పదవులు సైతం నామినేటెడ్ విధానంలో ఇస్తారనే వార్తలు
● ఇప్పటికే అధిష్టానానికి
నివేదిక ఇచ్చిన మీనాక్షి నటరాజన్
● డాక్టర్ కవితారెడ్డికి
రాష్ట్ర కార్పొరేషన్ పదవి!
● నామినేటెడ్ రేసులో ఎమ్మెల్యే
డాక్టర్ భూపతిరెడ్డి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నామినేటెడ్ పదవుల పందేరానికి కాంగ్రెస్ అధినాయకత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మార్చి 15లోగా పదవులను భర్తీ చేయాలంటూ పార్టీ నాయకత్వం సూచించినట్లు తెలియడంతో ఆశావహులు ఎవరికి వారు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పదవుల భర్తీ ఆలస్యం కావడంతో ముఖ్య నాయకుల్లో నిరాశ నెలకొందంటూ సీఎం, మంత్రులు, పీసీసీ అధ్యక్షుడితో అగ్రనేతల సమావేశానికి ముందే మీనాక్షి నటరాజన్ నివేదిక ఇచ్చారు. పదవుల పంపకానికి అనుమతి వచ్చినట్లు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ చెప్పడంతో జిల్లాకు చెందిన ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇదిలా ఉండగా సహకార సంస్థల పదవులు సైతం నామినేటెడ్ పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆశావహుల సంఖ్య పెరిగింది.
● ఎమ్మెల్యేలకూ కొన్ని కీలక పదవులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డికి కీలకమైన రాష్ట్ర కార్పొరేషన్ పదవి ఇస్తారనే చర్చ జరుగుతోంది. ఆర్టీసీ, గృహనిర్మాణ, పౌరసరఫరాల కార్పొరేషన్ పదవుల్లో ఏదైనా రావొచ్చని అంటున్నారు. లేనిపక్షంలో ప్రభుత్వ విప్ పదవి ఇవ్వొచ్చని తెలుస్తోంది. అయితే నామినేటెడ్ పదవులు ఎవరికి ఇస్తే పార్టీకి ఉపయోగపడుతుందనే అంశాన్ని సైతం మీనాక్షి నటరాజన్ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. జిల్లాలవారీగా నామినేటెడ్ పదవులు ఎవరికి ఇవ్వాలో జాబితా రూపొందించి ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు ఇప్పటికే నామినేటెడ్ పదవులు పొందిన నాయకుల పదవీకాలం పూర్తి అయితే వారికి పొడిగింపును ఇస్తారా లేకుంటే రొటేషన్‌లో భాగంగా మరికొందరు నాయకులతో భర్తీ చేస్తారా? అనే విషయంలో జిల్లాలో చర్చ జరుగుతోంది.
● ఇక 1988 నుంచి పార్టీకి సేవలందిస్తున్న మార చంద్రమోహన్‌రెడ్డి తాజాగా డీసీసీ పీఠం ఆశించి విఫలమయ్యారు. చంద్రమోహన్‌రెడ్డి నామినేటెడ్ రేసులో ఉన్నారు. అదేవిధంగా మరో సీనియర్ నాయకుడు బాడ్సి శేఖర్‌గౌడ్ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి రేసులో ఉన్నారు. 1983 నుంచి శేఖర్‌గౌడ్ కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తూ వస్తున్నారు. శేఖర్‌గౌడ్‌కు గీత కార్మిక కార్పొరేషన్ పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది. మాజీ డీసీఎంఎస్ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి నామినేటెడ్ రేసులో ఉన్నారు. మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, కాటిపల్లి నరేందర్‌రెడ్డి, నరాల రత్నాకర్, మాజీ డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్‌రెడ్డి ఆశావహులుగా ఉన్నారు. డీసీసీ పీఠం కోసం గట్టి ప్రయత్నాలు చేసిన బాస వేణుగోపాల్ యాదవ్ నామినేటెడ్ పదవి ఆశిస్తున్నారు. సహకార సంఘాల పదవులు నామినేటెడ్ విధానంలో ఇస్తారనే వార్తల నేపథ్యంలో పురన్‌రెడ్డి ఆ పదవికి ఆశావహుడిగా ఉన్నారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్‌రెడ్డి నామినేటెడ్ రేసులో ఉన్నారు. 1983 నుంచి పార్టీలో ఉంటూ జుక్కల్ ఎమ్మెల్యే టికెట్టు ఆశించి భంగపడిన గడుగు గంగాధర్ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి ఆశిస్తున్నారు. తనకు వ్యవసాయ కమిషన్ సభ్యుడిగా పదవి ఇవ్వడంపై గడుగు అసంతృప్తిగా ఉన్నారు.
జిల్లా నుంచి డాక్టర్ కవితారెడ్డికి ఆరోగ్య వసతుల అభివృద్ధి కార్పొరేషన్ పదవి ఇవ్వనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు యువ నాయకులకు అవకాశాలు దక్కనున్నట్లు తెలుస్తోంది.
చాన్స్.. ప్లీజ్!


