మోర్తాడ్‌లో స్వల్ప ఉద్రిక్తత
● శివాజీ విగ్రహా ప్రతిష్ఠాపనను
అడ్డుకున్న పోలీసులు
● మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు
కొనసాగిన హైడ్రామా
మోర్తాడ్: మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ సాగిన హైడ్రామాకు పోలీసులు తెరదించారు. జాతీయ రహదారి నుంచి గ్రామంలోకి వెళ్లే దారిలో సెంట్రల్ లైటింగ్ వద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని యువజన సంఘాల సభ్యులు, శివాజీ అభిమానులు నిర్ణయించారు. ఇక్కడ కాకుండా మరో చోట ఏర్పాటు చేయాలని పోలీసులు సూచించారు. అందరికి కనిపించేలా సెంట్రల్ లైటింగ్ వద్దే ఏర్పాటు చేస్తే చేస్తామని యువజన సంఘాల సభ్యులు భీష్మించారు. పోలీసులు మాత్రం అనుమతి లేకుండా ప్రతిష్ఠిస్తే తాము అంగీకరించబోమని పట్టుబట్టారు. దీంతో జాతీయ రహదారి సమీపంలో యువజన సంఘాల సభ్యులు నిరసనకు దిగారు. మధ్యాహ్నం గ్రామంలోనే పోలీసులు విగ్రహాన్ని ఊరేగించడాన్ని అడ్డుకున్నారు. యువజన సంఘాల సభ్యులు పట్టుదలతో ఉండటంతో ఒక దశలో పోలీసులు వెనక్కి తగ్గారు. రాత్రిపూట ప్రతిష్ఠించే సమయంలోనే పోలీసులు కఠినంగా వ్యవహరించడంతో విగ్రహా ప్రతిష్ఠాపన నిలిచిపోయింది. యువజన సంఘాల సభ్యులు, శివాజీ వీరాభిమానులను పోలీసులు చెదరగొట్టి విగ్రహాన్ని తరలించారు. విగ్రహ స్థలం వద్ద పోలీసులు పికెటింగ్‌ను కొనసాగిస్తున్నారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి, భీమ్‌గల్ సీఐ సత్యనారాయణ, మోర్తాడ్, కమ్మర్‌పల్లి ఎస్సైలు రాము, అనిల్, పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నారు.
మోర్తాడ్‌లో స్వల్ప ఉద్రిక్తత


