దివ్యాంగ విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలి
● కలెక్టర్ ఇలా త్రిపాఠి
● ఆర్మూర్, నందిపేట్
భవిత కేంద్రాల సందర్శన
ఆర్మూర్: భవిత కేంద్రాల్లో దివ్యాంగ విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని, వారిని గాయపర్చే పదునైన వస్తువులు కేంద్రంలో లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఆర్మూర్, నందిపేట్ మండల కేంద్రాల్లో ఉన్న భవిత కేంద్రాలను కలెక్టర్ బుధవారం సందర్శించారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఉద్దేశించిన ఈ కేంద్రాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అధికారులను ఆదేశించారు. ముందుగా ఆర్మూర్ పట్టణంలోని భవిత కేంద్రాన్ని తనిఖీ చేసి, నిర్వహణ తీరుతెన్నులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. చిన్నారులను కలెక్టర్ ఆప్యాయంగా పలకరించి కరచలనం చేస్తూ, వారికి చాక్లెట్లు పంచి పెట్టారు. యాక్టివిటీ, థెరపీ రూమ్, టాయిలెట్స్, ఆఫీసు గదితో పాటు భవిత కేంద్రంలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఫిజియోథెరపీ తరహాలో స్పీచ్ థెరపీస్టులను నియమించాలని సూచించారు. అనంతరం నందిపేట్ మండల కేంద్రంలో మరమ్మతులు చేపడుతున్న భవిత కేంద్రాన్ని సందర్శించారు. పనులు వేగంగా, నాణ్యతతో జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వి య, డీఈవో పీ అశోక్, ఇంజినీరింగ్ విభాగం అధికారులు జీ రవి, ఉదయ్ కిరణ్, మురళి, ఆర్మూర్ ఎంఈవో రాజ గంగారాం, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీవో శివాజీ, ఆర్మూర్, నందిపేట్ ఐఈర్పీలు కిషన్, సురేశ్, నగేశ్ గౌడ్ తదితరులు ఉన్నారు.


