నందిపేటలో దొంగల బీభత్సం
● పట్టపగలు తాళం వేసిన ఇంట్లో చోరీ
● పది తులాల బంగారు నగలు,
రూ.1.50 లక్షల నగదు అపహరణ
నందిపేట్: నందిపేట మండల కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టపగలు తాళం వేసిన ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. బీరువాను ధ్వంసం చేసి అందులో ఉన్న పది తులాల బంగారు నగలు, రూ. 1.50 నగదును ఎత్తుకెళ్లారు. ఎస్సై శ్యాంరాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని బర్కత్‌పుర కాలనీలో నివాసం ఉంటున్న మహమూద్ అనే వ్యక్తి మెడికల్ షాప్ నిర్వహిస్తు జీవిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు తన ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లాడు. ఇది గమనించిన దుండగులు చోరీకి పాల్పడ్డారు. 2 గంటల సమయంలో ఇంటికి వచ్చిన అతనికి వేసిన తాళం పగులగొట్టి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. ఈ చోరీలో బీరువాలో ఉన్న పది తులాల బంగారు నగలు, రూ. లక్షన్నర నగదును దుండగులు దొంగిలించినట్లు బాధితుడు పేర్కొన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


