ముడుపులిస్తే.. మింగేయొచ్చు
అటవీ భూముల కబ్జాలను అడ్డుకోవాల్సిన అధికారులే అండగా నిలుస్తున్నారు. ముడుపులు తీసుకుంటూ అక్రమార్కులకు మార్గం సుగమం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ సంపాదన కోసం ఒకరికి మించి మరొకరు పోటీ పడుతున్నట్లు సమాచారం. సిరికొండ రేంజ్‌లో జరిగిన మాదిరిగానే కమ్మర్‌పల్లి రేంజ్‌లో మరో వ్యవహారం బయటపడింది.
● కమ్మర్‌పల్లి ఫారెస్ట్ రేంజ్‌లోనూ అవినీతి పర్వం!
● అధికారుల జేబులు తడిపితే అటవీభూముల
కబ్జాకు గ్రీన్ సిగ్నల్
● అన్యాక్రాంతంలో పాత్ర ఉన్న ఇద్దరు అధికారులపై
చర్యలకు సిఫారసు
● మూడు నెలలైనప్పటికీ కరువైన చర్యలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: అడవులను సంరక్షించాల్సిన అధికారులే అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అటవీ సంరక్షణలో కేంద్ర, రాష్ట్ర చట్టాలను అమలు చేసేందుకు ప్రజాధనం జీతంగా వస్తున్నప్పటికీ అది చాలదన్నట్లు, జీతాలు తీసుకుని మరీ అడవులను కనుమరుగు చేస్తూ భారీగా దండుకుంటున్నారనే విమర్శలు తీవ్రంగా వస్తున్నాయి. పరిస్థితి ఎలా మారిందంటే తమకు ఉద్యోగం ఇచ్చి జీతాలు చెల్లించేది అక్రమ సంపాదనకు పోటీపడేందుకన్నట్లుగా వ్యవహరిస్తున్నారని పర్యావరణవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసం అడవులను గుల్ల చేస్తున్న అక్రమార్కులకు అండగా నిలవడమే పనిగా విధులు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒకరిని మించి ఒకరు అక్రమ సంపాదన కోసం పోటీ పడుతునన్నట్లు తెలుస్తోంది. అమ్మలాంటి అడవులను కాసుల కోసం అమ్మకానికి పెడుతున్నారు. ఇటీవల సిరికొండ ఫారెస్ట్ రేంజ్‌లో ఓ సెక్షన్ ఆఫీసర్ ఇలాంటి ఘటనలోనే సస్పెండ్ కావడం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా కమ్మర్‌పల్లి అటవీ రేంజ్‌లో మరో వ్యవహారం బయట పడింది.
ఇక్కడ పనిచేస్తున్న ముగ్గురు అధికారులపై వచ్చిన అక్రమ వ్యవహారాల ఆరోపణలు అటవీ శాఖలో చర్చనీయాంశమయ్యాయి. అటవీ భూముల ఆక్రమణల్లో పాత్ర ఉన్నట్లు తేలడంతో ఓ సెక్షన్ ఆఫీసర్, మరో బీట్ ఆఫీసర్‌పై చర్యల కోసం ఎఫ్‌ఆర్‌వో రవీందర్ ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు. ఇది జరిగి మూడు నెలలు అయినప్పటికీ సదరు అధికారులపై ఎలాంటి చర్యలు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని పలువురు చెబుతున్నారు.
ఐదు సెక్షన్లు.. 18 బీట్లు..
కమ్మర్‌పల్లి రేంజ్ పరిధిలో మొత్తం 35 వేల ఎకరాలకు పైగా అటవీ విస్తీర్ణం ఉంది. ఐదు సెక్షన్లు, 18 బీట్లు ఉండగా 8 బీట్లకు అధికారులు లేకపోవడంతో ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఈ రేంజ్‌లో పనిచేస్తున్న కొందరు అధికారులు అక్రమార్కులతో మిలాఖత్ అయి అటవీ భూములకు ఎసరు పెడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు సెక్షన్ అధికారి, బీట్ అధికారి పనిచేస్తున్న పరిధిలో భీమ్‌గల్ మండల ప్రాంతంలో 4 ఎకరాల అటవీ భూమి కబ్జాకు గురైంది. కబ్జాదారుల నుంచి ముడుపులు తీసుకుని పూర్తి సహకారం అందించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫోన్‌పే ద్వారా డబ్బు లు పొందినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో విచారణ చేపట్టి ఇద్దరు అధికారులపై చర్యలకు ఫైల్ సిద్ధం చేశారు. కబ్జా చేసిన వ్యక్తులపై కూడా కేసులు నమోదు చేశారు. గతేడాది అక్టోబర్‌లో ఫైల్ ఆర్మూ ర్ ఎఫ్‌డీవోకు, తర్వాత అక్కడి నుంచి డీఎఫ్‌వోకు వెళ్లింది. అయితే వీళ్లపై చర్యలు తీసుకోకుండా అధి కారులపై ఒత్తిడి తెచ్చినట్లుగా తెలుస్తోంది. ‘మాపై చర్యలు తీసుకుంటే అందరి బాగోతం బయటపెడుతాం’ అని వారు అన్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఇన్ని రోజులైనప్పటికీ వాళ్లపై చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. కమ్మర్‌పల్లి రేంజ్‌లో పనిచేస్తున్న మరొక డి ప్యూటీ ఎఫ్‌ఆర్‌వో మీద కూడా ఇలాంటి ఆరోపణలే ఉన్నాయి. బయటకు పొక్కకుండా ఉన్నతాధికారు లే కాపాడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అటవీ అధికారులే ఆక్రమణలకు దన్నుగా నిలుస్తుండడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కమ్మర్‌పల్లి ఎఫ్‌ఆర్‌వో రవీందర్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా ఆరోపణలు వాస్తవమేనని, ఇద్దరి మీద నివేదిక రాసి ఉన్నతాధికారులకు పంపామన్నారు. మరొక అధికారిపై వచ్చిన ఆరోపణలు తన దృష్టికి రాలేదన్నారు. ఈ విషయమై జిల్లా అటవీ అధికారి వికాస్‌మీనాకు ఫోన్ చేయగా స్పందించలేదు.
ముడుపులిస్తే.. మింగేయొచ్చు


