రైతు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
● డీఏవో వీరాస్వామి
డొంకేశ్వర్(ఆర్మూర్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ భూమి కలిగిన ప్రతి రైతు ‘ఫార్మర్ రిజిస్ట్రేషన్’ చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి వీరాస్వామి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే పీఎం కిసాన్ లాంటి కేంద్ర ప్రభుత్వ పథకాలకు అర్హులన్నారు. జిల్లాలో 2,91,749 మంది రైతులకు గాను ఇప్పటి వరకు 1,74,979 మంది (60 శాతం) మాత్రమే ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. మిగిలిన వారు త్వరగా నమోదు చేసుకోవాలన్నారు. అందుకోసం రైతులు ఆధార్ కార్డుకు లింకు కలిగిన ఫోన్ తీసుకెళ్లి స్థానిక వ్యవసాయాధికారులను లేదా మీ సేవా కేంద్రాలకు వెళ్లి నమోదు చేసుకోవాలని డీఏవో కోరారు.
ముగిసిన
‘మున్సిపల్’ కోడ్
సుభాష్‌నగర్: జిల్లాలోని నిజామాబాద్ నగరపాలక సంస్థతోపాటు ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్ మున్సిపాలిటీల్లో ఎన్నికల కోడ్ ముగిసింది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం మున్సిపాలిటీల్లో జనవరి 27వ తేదీ నుంచి కోడ్ అమల్లోకి వచ్చింది. ఫిబ్రవరి 17వ తేదీతో ఎన్నికల కోడ్ ముగిసినట్లు అధికారులు ప్రకటించారు. బుధవారం నుంచి రోజూవారీ పనులతోపాటు అభివృద్ధి కార్యక్రమాలు, ఇతరత్రా కార్యకలాపాల్లో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మున్సిపల్‌లోని ఆయాశాఖల అధికారులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు. కాగా, జిల్లాలో మేయర్, డిప్యూటీ మేయర్, చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో అటు పోలీసులు, ఇటు కమిషనర్లు, ఎన్నికల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
నాణ్యమైన సేవలు
అందించాలి
● డీఎంహెచ్‌వో రాజ శ్రీ
● కీటక జనిత వ్యాధులపై సమీక్ష
సుభాష్‌నగర్: కీటక జనిత వ్యాధుల నియంత్రణలో భాగంగా పనిచేసే సబ్ యూనిట్ అధికారులు, పర్యవేక్షక అధికారులు, ల్యాబ్ టెక్నీషియన్లు వారి వారి విధుల్లో నాణ్యమైన సేవలు అందిస్తూ యాక్టివ్, పాసివ్ ఆర్‌డీటీని పెంచాలని డీఎంహెచ్‌వో రాజ శ్రీ తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని కీటక జనిత వ్యాధుల నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో బుధవారం డీఎంహెచ్‌వో కార్యాలయ స మావేశ మందిరంలో కీటక జనిత వ్యాధుల నియంత్రణపై సమీక్ష నిర్వహించారు. మలే రియా, ఫైలేరియా, డెంగీ, చికున్‌గున్యా, మె దడువాపు వంటి అన్నిరకాల వ్యాధులపై సమీక్షించారు. డాక్టర్ రాజ శ్రీ మాట్లాడుతూ ఐహెచ్‌ఐపీ మలేరియా పోర్టల్‌లో, ఎం4 అబ్స్‌ట్రాక్ట్ రిపోర్టును నిరంతరం ఎంట్రీ చే యాలన్నారు. ఫ్రైడే డ్రై డేను పకడ్బందీగా ని ర్వహిస్తూ ముందస్తు ప్రణాళిక, ప్రతి వారం నివేదికలను సమర్పించాలని సూచించారు. ప్రజలకు కీటక జనిత వ్యాధులు, సీజనల్ వ్యాధులపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో డీఎంవో వెంకటేశ్, డాక్టర్ శ్రావ్య, ఏఎంవో షేక్ సలీం, సబ్ యూనిట్ అధికారులు, పర్యవేక్షక అధికారులు, ల్యాబ్ టెక్నీషియన్లు పాల్గొన్నారు.
ముగిసిన పీజీ
మూడో సెమిస్టర్ పరీక్షలు
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ప్రధాన క్యాంపస్‌తోపాటు జిల్లా లో ఏర్పాటు చేసిన మూడు పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన పీజీ మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు 617 మందికి 585 మంది హాజరుకాగా 32 మంది గైర్హాజరైనట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు.


