పుస్తక పఠన సంకల్పం
● ప్రత్యేకంగా ఒక పీరియడ్
● సుంకెట్ ఉన్నత పాఠశాలలో అమలు చేస్తున్న ఉపాధ్యాయులు
● గ్రంథాలయం ఏర్పాటు
మోర్తాడ్(బాల్కొండ): సెల్ ఫోన్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా తదితర సామాజిక మాధ్యమాలతో నేటి యువత వ్యసనపరులవుతున్న నేపథ్యంలో ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థుల్లో పఠన నైపుణ్యాన్ని పెంపొందించేందుకు మోర్తాడ్ మండలం సుంకెట్ ఉన్నత పాఠశాలలో వినూత్న కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతి విద్యార్థికి పుస్తక పఠనం అలవాటు చేయాలనే సంకల్పంతో ఒక పీరియడ్‌ను గ్రంథాలయంలోనే కొనసాగిస్తున్నారు. పుస్తక పఠనం అబ్బితే ఉన్నత విద్య, ఉద్యోగ అర్హత పరీక్షలలో సులభంగా రాణించే అవకాశం ఉంటుందని ప్రధానోపాధ్యాయుడు సంతోష్‌కుమార్ భావించారు. విజ్ఞానం అందించే ఎన్నో రకాల పుస్తకాలను పాఠశాల గ్రంథాలయంలో అందుబాటులో ఉంచారు. ఇంగ్లిష్, తెలుగు, హిందీ కథల పుస్తకాలు, ప్రముఖుల జీవిత చరిత్రలతోపాటు సమాజానికి ఉపయోగపడే ఎన్నో రకాల పుస్తకాలను గ్రంథాలయంలో నిలువ చేశారు. ప్రతి తరగతి విద్యార్థులు వారంలో ఒక రోజు గ్రంథాలయంలో పుస్తక పఠనం చేసేలా షెడ్యూల్‌ను రూపొందించారు. తెలుగు ఉపాధ్యాయుడు నర్సింగ్‌దాస్ ఈ పుస్తక పఠనం పీరియడ్‌ను తీసుకుంటున్నారు. ప్రతి పాఠశాలలో పుస్తక పఠనానికి ఒక పీరియడ్ కేటాయించాలని నియమం ఉన్నా ఎక్కువ చోట్ల ఇది అమలు కావడం లేదు. సుంకెట్ ఉన్నత పాఠశాలలో మాత్రం ఒక ప్రత్యేక పీరియడ్‌ను పుస్తక పఠనం కోసం అమలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.


