ఆరోగ్య జీవితానికి యోగా
● అర్సపల్లి ‘మైనారిటీ యోగా
కేంద్రం’లో 25 ఏళ్ల ఉత్సవం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ అర్సపల్లిలోని మైనారిటీ యోగా కేంద్రంలో మంగళవారం 25 సంవత్సరాల వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. ప్రముఖ యోగా గురువు అయిన ‘యోగా రత్న’ ఎక్కొండ ప్రభాకర్ ఆధ్వర్యంలో 2000 సంవత్సరంలో ఈ మైనారిటీ యోగా కేంద్రాన్ని ప్రారంభించారు. మొదట్లో అర్సపల్లి ఐటీఐ కళాశాల ప్రాంగణంలో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం నాలెడ్జ్ పార్క్ స్కూల్‌లో నిర్వహిస్తున్నామని ప్రభాకర్ తెలిపారు. ప్రతిరోజూ యోగా చేస్తుండడంతో తామంతా అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడ్డామని యోగా కేంద్రం సభ్యులు, సీనియర్ సిటిజన్స్ తెలిపారు. కార్యక్రమంలో మైనారిటీ యోగా కేంద్రం అధ్యక్షుడు అబిద్ అలీ, నాలెడ్జ్ పార్క్ పాఠశాల కరస్పాండెంట్ సయ్యద్ ముజీబ్, షహీద్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
ఖలీల్‌వాడి: రంజాన్ మాసంలో ఉర్దూ విద్యాలయాల పని వేళల్లో మార్పు ఉంటుందని డీఈవో అశోక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 19 నుంచి మార్చి 20వ తేదీ వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఉర్దూ విద్యాలయాలు పని చేస్తాయని పేర్కొన్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు.
ఈనెల 23 నుంచి
ఎల్‌ఎల్‌బీ సెమిస్టర్ పరీక్షలు
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ఎల్‌ఎల్‌బీ ఐదో సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షలు ఈనెల 23వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కే సంపత్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్‌సైట్ www.telanganauniversity.ac. inను సంప్రదించాలని ఆయన సూచించారు.
రుద్రూర్: పొతంగల్ మండలం హంగర్గ గ్రామానికి చెందిన ఫౌజియా రైస్ మిల్ యజమాని మహ్మద్ వహీద్‌పై కేసు నమోదు చేసినట్లు కోటగిరి ఎస్సై సునీల్ తెలిపారు. ప్రభుత్వం ద్వారా రైస్‌మిల్‌కు సరఫరా చేసిన 6,62,043 క్వింటాళ్ల ధాన్యాన్ని దుర్వినియోగం చేయడంతో సివిల్ సప్లై అధికారి మంగళవారం ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ధాన్యం విలువ రూ. 2,69,52,235 ఉంటుందన్నారు. సివిల్ సప్‌లై డీఎం శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బాధితులు పోగొట్టుకున్న ఫోన్లను ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ మంగళవారం తన కార్యాలయంలో వారికి అందజేశారు. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా పోయిన ఫోన్లను సేకరించి బాధితులైన నిఖిల్‌రెడ్డి, గంగారెడ్డి, జగదీశ్‌కు అందించినట్లు ఎస్‌హెచ్‌వో పేర్కొన్నారు.
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని జల్దిపల్లి గ్రామ శివారులో పేకాట స్థావరంపై దాడి చేసి ఎనిమిది మందిని పట్టుకున్నట్లు ఎస్సై దీపక్‌కుమార్ తెలిపారు. మంగళవారం గ్రామ శివారులో పేకాడుతున్నట్లు సమాచారం రావడంతో దాడి చేశామన్నారు. ఈ దాడిలో 8 మందిని పట్టుకోగా వారి నుంచి రూ. 11,360 నగదు, 7 ఫోన్లను స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


