యూరియా కోసం రైతుల రాస్తారోకో
వర్ని (మోస్రా): సకాలంలో యూరియా అందడం లేదని ఆరోపిస్తూ మోస్రా మండలం గోవూరు గ్రామంలో రైతులు వర్ని–నిజామాబాద్ ప్రధాన రహదారిపై సోమవారం రాస్తారోకో నిర్వహించారు. సహకార సంఘంలో యూరియా వచ్చిన వెంటనే యాప్‌లో ఇతర ప్రాంతాల రైతులు బుక్ చేసుకుంటున్నారని, స్థానికులకు యూరియా అందడం లేదని రైతులు ఆరోపించారు. స్థానికులకే యూరియా అందజేయాలని, యాప్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులు, నిరక్షరాస్య రైతులకు యాప్‌లో యూరియా బుక్ చేయడం రావడంలేదని దీంతో యూరియా దొరకక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి రైతుకు యూరియా అందేలా చర్యలు తీసుకుంటామని మోస్రా మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్ రైతులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.


