25.16 శాతం ఓట్లతో అధికారంలోకి కాంగ్రెస్
ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపాలిటీలో మొత్తం ఓట్లు 63,972 ఉండగా ఈ నెల 11వ తేదీన నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌లో 43,239 మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో పోలింగ్ శాతం 67.59గా నమోదైంది. ఇంకా 20,683 మంది ఓటర్లు అంటే 32.41 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. మరో వైపు ఓట్ల లెక్కింపు అనంతరం అధికారులు ప్రకటించిన అధికారిక లెక్కల ప్రకారం ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీల ఓట్లు లెక్కగడితే ఓటు విలువ ఏంటో అర్థం అవుతుంది. ఈ గణాంకాల ప్రకారం పట్టణంలోని 36 వార్డుల్లో కలిపి కాంగ్రెస్ పార్టీకి 16,098 ఓట్లు అంటే 25.16 శాతం, బీజేపీకి 11,979 (18.72 శాతం), బీఆర్‌ఎస్ పార్టీకి 7,398 (11.56 శాతం), ఎంఐఎం 992 (1.55) శాతం ఓట్లు వచ్చాయి. అత్యధిక ఓట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తుండగా బీజేపీ రెండో స్థానంలో నిలబడగా బీఆర్‌ఎస్ పార్టీ మూడో స్థానానికి సరిపెట్టుకొంది. ఓటర్లు ఓటు హక్కుపై అవగాహన పెంచుకొని ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటే అత్యధిక ప్రజలు మెచ్చే పార్టీ అధికారంలోకి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
18.72 శాతం ఓట్లతో
బీజేపీ రెండో స్థానంలో..
11.56 శాతం ఓట్లకే
పరిమితమైన బీఆర్‌ఎస్
ఎంఐఎంకు 1.55 శాతం ఓట్లు


