నికాల్‌పూర్‌లో పావురాల కలకలం
● కాళ్లకు రింగ్ చూసి ఆందోళనకు
గురైన గ్రామస్తులు
డొంకేశ్వర్(ఆర్మూర్): డొంకేశ్వర్ మండలం నికాల్‌పూర్ గ్రామంలో శుక్రవారం ట్యాగ్ కలిగిన పావురాలు కలకలం సృష్టించాయి. వాటి కాళ్లకు ఉన్న పసుపు రంగు ట్యాగ్ (రింగు), దానిపై నంబర్లను చూసి గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి... గ్రామ శివారులోని జంగం చెరువు ప్రాంతంలో మత్స్యకారులు ఉంచిన చేపల వలకు మూడు పావురాలు చిక్కుకున్నాయి. స్థానిక వ్యవసాయదారులు గమనించి పావురాలను వల నుంచి తీసే ప్రయత్నం చేశారు. కాళ్లకు ఉన్న రింగు లాంటి పరికరాన్ని చూసి ఏంటోనని ఆందోళనకుగురయ్యారు. గ్రామస్తులకు సమాచారం అందించగా వారు కూడా వచ్చి పావురాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునే ప్రయత్నం చేశారు. గూఢచారి పావురాలని ఒకరు, జీపీఎస్ ట్రాకింగ్ చేసేవని మరొకరు, రేసింగ్ పావురాలని ఇంకొకరు చర్చించుకున్నారు. పావురాల కాలికి ఉన్న రింగ్‌పై ‘702’ నంబరుతోపాటు కేఎల్‌ఆర్‌పీసీ, కేవోఎల్‌ఏఆర్ 2025–ఇండియా అని రాసి ఉంది. ఇలాంటివి సాధారణంగా రేసింగ్ పావురాలకే ఉంటాయని లేదా ప్రభుత్వాలు కూడా పావురాల కదలికలు, సంచార సమాచారం తెలుసుకోవడానికి ఇలాంటి ట్యాగ్‌లు కడుతారని అవగాహన కలిగిన ఒకరిద్దరు అధికారులు ‘సాక్షి’తో పేర్కొన్నారు. నికాల్‌పూర్ బ్యాక్ వాటర్‌కు ఆనుకొని ఉన్న గ్రామం కావడంతో మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతం నుంచి దారితప్పి వచ్చి ఉంటాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, వలలో చిక్కుకున్న ఆ మూడు పావురాలను గ్రామస్తులు వదిలిపెట్టారు.


