కాంగ్రెస్‌లో కలవని చేతులు
● ఎన్నికల నేపథ్యంలో
ఇద్దరు నేతల మధ్య ఘర్షణ
● బాన్సువాడలో అర్ధరాత్రి ఉద్రిక్తత
బాన్సువాడ/రుద్రూర్: హస్తం పార్టీలోని నేతల మధ్య సయోధ్య కరువయ్యింది. తన భార్యను ఓడించడానికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రశేఖర్ ప్రయత్నిస్తున్నారంటూ ఆంగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్ దాడికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. వివరాలిలా ఉన్నాయి. బాన్సువాడ మున్సిపల్ ఎన్నికలలో కాసుల బాల్‌రాజ్ భార్య విజయ 5వ వార్డునుంచి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆమెకు చైర్ పర్సన్ అయ్యే అవకాశాలున్నాయి. దీంతో ఆమెను ఓడించడానికి ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం జరుగుతోందని సోమవారం అర్ధరాత్రి సమాచారం అందడంతో కాసుల బాల్‌రాజ్ అక్కడికి బయలుదేరారు. ఎదురుగా కారులో వస్తున్న బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ చంద్రశేఖర్‌ను ఆయన తన అనుచరులతో కలిసి అడ్డుకున్నారు. చంద్రశేఖర్ కాలర్ పట్టుకుని తన భార్యను ఓడించడానికి బీఆర్‌ఎస్ నేతలతో కుమ్మక్కయ్యావంటూ దుర్భాషలాడారు. అర్ధరాత్రి సమయంలో బీఆర్‌ఎస్ నాయకుడు యలమంచలి శ్రీనివాస్‌ను తాడ్కోల్‌లో ఎందుకు కలిశావంటూ నిలదీశారు. కారులో డబ్బులున్నాయని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం వచ్చింది. కారులో రూ. 52 వేలు లభించాయి. అయితే అవి తనవి కావని, కాసుల బాల్‌రాజ్ అనుచరులే పెట్టారని చంద్రశేఖర్ ఆరోపించారు.
వైరల్‌గా మారిన వీడియోలు..
కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చంద్రశేఖర్ తాడ్కోల్‌లోని వెంకట్రాంరెడ్డి ఇంట్లో బీఆర్‌ఎస్ నాయకుడు యలమంచలి శ్రీనివాస్‌తో సమావేశమై తిరిగి వెళ్తున్న సీసీ కెమెరా దృశ్యాలతోపాటు.. చంద్రశేఖర్‌పై కాసుల బాల్‌రాజ్ దాడి దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ గొడవపై ఇరువర్గాలు అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకున్నట్లు తెలిసింది.
రుద్రూర్ బంద్ ప్రశాంతం
మాజీ సర్పంచ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందూరు చంద్రశేఖర్‌పై దాడికి నిరసనగా మంగళవారం నిర్వహించిన రుద్రూర్ బంద్ ప్రశాంతంగా ముగిసింది. బస్టాండ్ ప్రాంతంలో కాంగ్రెస్ నాయకులు ధర్నా చేశారు. అనంతరం ప్రధాన రోడ్డుపై బైఠాయించారు. రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కా సుల బాల్‌రాజు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రుద్రూర్‌లో 15 ఏళ్లుగా కాంగ్రెస్ జెండాను మోస్తు న్న సీనియర్ నాయకుడు చంద్రశేఖర్‌ను బాల్ రాజు దుర్భాషలాడుతూ దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. బాల్ రాజును వెంటనే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అధిష్టానాన్ని కోరారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ద్రోణపల్లి సతీశ్, కొత్తకొండ భాస్కర్, ఏఎంసీ మాజీ చైర్మన్ మాసాని శ్రీనివాస్ రెడ్డి, పాత బాలకృష్ణ, రుద్రూర్ సర్పంచ్ ఇందూర్ సునీత, ఉప సర్పంచ్ నిస్సార్, కాంగ్రెస్ ఎస్టీ సెల్ జిల్లా కోఆర్డినేటర్ అంబర్‌సింగ్, బీసీ సెల్ అధ్యక్షుడు కర్క అశోక్, కూనిపూర్ సర్పంచ్ లక్ష్మణ్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌లో కలవని చేతులు


