మహిళా సంఘాలదే హవా..
ఎస్‌హెచ్‌జీల్లోని మహిళల వివరాలు
● సంఘానికి రూ. 3వేల నుంచి రూ. 5వేలు
● ప్రచారానికి ఒక
లెక్క.. ఓటు వేసేందుకు మరో లెక్క..
● మహిళల ఓట్ల కోసం అభ్యర్థుల పాట్లు
ఆర్మూర్: మున్సిపల్ ఎన్నికల్లో మహిళా సంఘాల హవా కొనసాగుతోంది. దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలనే నానుడికి అనుగుణంగా మహిళలు వ్యవహరిస్తున్నారు. వార్డుల్లో అభ్యర్థుల తరఫున ప్రచారానికి ఒక లెక్క.. పోలింగ్ రోజు ఓటు వేసేందుకు మరో లెక్క అని ముందుగానే ఒప్పందాలు చేసుకుంటున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ పరిఽధిలోని 60 డివిజన్‌లతోపాటు ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్ మున్సిపాలిటీల పరిధిలోని 86 వార్డుల నుంచి రాజకీయ పార్టీల తరఫున, స్వతంత్రులుగా నిలిచిన అభ్యర్థులు వీధుల్లో ప్రచారం కోసం మహిళా సంఘాల సభ్యులను ఉపయోగించుకుంటున్నారు. వార్డు పరిధిలోని మహిళా సంఘాల సభ్యులకు డబ్బులు ముట్టజెప్పి ప్రచారానికి తిప్పుకుంటున్నారు. అయితే, పార్టీ ఏదైనా అభ్యర్థుల వెంట ఆ వార్డుకు చెందిన మహిళా సంఘాల సభ్యులే ప్రతి రోజు కనిపిస్తున్నారు. ఒక్కో సభ్యురాలు ప్రచారానికి వస్తే రూ.200 నుంచి రూ.500 వరకు చెల్లిస్తున్నారు.
మహిళల ఓట్లే కీలకం..
స్వయం సహాయక మహిళా సంఘాల్లో పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారే సభ్యత్వం కలిగి ఉన్నారు. దీంతో అన్ని డివిజన్‌లు, వార్డుల్లో మహిళా సంఘాల సభ్యుల ఓట్లే అభ్యర్థుల గెలుపు, ఓటమిలను ప్రభావితం చేసేవిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమ గెలుపు కోసం అభ్యర్థులు మహిళా సంఘ సభ్యులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. మహిళా సంఘం లీడర్లతో రాయబారాలు కొనసాగిస్తున్నారు. లీడర్ల నిర్ణయం మేరకు ఆ సంఘం సభ్యులంతా కట్టుబడి ఉండే పరిస్థితులు ఉన్నందున ముందుగా సంఘం లీడర్లతో మంతనాలు సాగిస్తున్నారు. ఒక్కో సంఘానికి రూ. 3 వేల నుంచి రూ. 5 వేల వరకు ముట్టజెపుతున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా తమ పరిధిలో పోటీకి నిలిచిన ప్రతి అభ్యర్థితో వేర్వేరుగా సమావేశమై డబ్బులు తీసుకుంటున్నారు. ఒక్కో డివిజన్, వార్డులో సుమారు నలుగురు అభ్యర్థులు పోటీలో ఉంటే ప్రతి సంఘానికి రూ. 20 వేల వరకు డబ్బులు అందుతున్నట్లు తెలిసింది. ఎన్నికల నియమావళి ప్రకారం ఓటును డబ్బుతో కొనుగోలు చేయడం నేరం. ఒకవైపు అధికారులు ఓటు హక్కును అమ్ముకోవద్దని ప్రచారం చేస్తున్నా.. మరోవైపు మహిళలు తెలివిగా వ్యవహరిస్తూ తమ ఓటు హక్కును అభ్యర్థులకు ఎరగా వేస్తూ లాభపడుతున్నారు.


