గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలి | - | Sakshi
Sakshi News home page

గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలి

Feb 6 2026 7:27 AM | Updated on Feb 6 2026 7:27 AM

గోదావ

గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలి

అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌

నిజామాబాద్‌ అర్బన్‌: వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ కిరణ్‌కుమార్‌ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో గురువారం గోదావరి పుష్కరాలు–2027 ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వీలుగా పుష్కర ఘాట్ల వద్ద అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతాలైన కందకుర్తి, తాడ్‌బిలోలి, కోస్లీ, తుంగిని, బినోల, ఉమ్మెడ, పోచంపాడ్‌, సావెల్‌, తడ్‌పాకల్‌, దోంచంద, గుమ్మిర్యాల్‌ వద్ద 15 పుష్కర ఘాట్లు ఉంటాయని, వీటితోపాటు అనువైన ప్రదేశాలను కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి గుర్తించాలన్నారు.

పసుపును ఎండబెట్టి

తీసుకురావాలి

పాటుకూరి తిరుపతిరెడ్డి

సుభాష్‌నగర్‌: సాంగ్లీ పసుపు మార్కెట్‌లోకి జిల్లా రైతులు పసుపు పంటను బాగా ఎండబెట్టి, డబుల్‌ పాలిష్‌తో ఎక్స్‌పోర్ట్‌ క్వాలిటీగా చేసుకుని తీసుకొస్తున్నారని, అందుకే మంచి ధర వస్తుందని జేఎంకేపీఎం పసుపు రైతు ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్‌ పాటుకూరి తిరుపతిరెడ్డి తెలిపారు. మహారాష్ట్రలోని సాంగ్లీ పసుపు మార్కెట్‌ను జేఎంకేపీఎం పసుపు రైతు ఉత్పిత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా పసుపు క్రయవిక్రయాలపై రైతులను అడిగి తెలుసుకున్నారు. అంక్సాపూర్‌ నుంచి తీసుకొచ్చిన పసుపు కొమ్ముకు రూ.16,800, మండకు రూ.13 వేల ధర రావడం శుభసూచికమని పేర్కొన్నారు. నిజామాబాద్‌ మార్కెట్‌ యార్డులో నాణ్యమైన పసుపునకు సరైన ధర అందించాలని పసుపు రైతు ఉత్పిత్తిదారుల సంఘం తరపున పసుపు బోర్డు చైర్మన్‌ పల్లె గంగారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ముప్ప గంగారెడ్డికి విన్నవించారు. అవసరమైతే సాంగ్లీ వ్యాపారులను నిజామాబాద్‌ మార్కెట్‌కు రప్పించి పసుపు కొనుగోలు చేయిస్తే రైతులకు ప్రయోజనం చేకూరుతుందని కోరారు.

పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకోవాలి

నిజామాబాద్‌ అర్బన్‌: మున్సిపల్‌ ఎన్నికల విధులు నిర్వర్తించనున్న ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఐడీఓసీ(కలెక్టరేట్‌), మున్సిపల్‌ కార్యాలయాల్లో ఓటర్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఇలా త్రిపాఠి తెలిపారు. ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని కలెక్టర్‌ సూచించారు. నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఎన్నికల విధులు కేటాయించిన ఉద్యోగులు ఐడీఓసీ(కలెక్టరేట్‌)లో పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం వినియోగించుకునేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. అదేవిధంగా బోధన్‌ మున్సిపల్‌ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న వారు బోధన్‌ మున్సిపల్‌ కార్యాలయంలో, ఆర్మూర్‌లో విధులు నిర్వర్తించనున్న వారు ఆర్మూర్‌ మున్సిపల్‌ కార్యాలయంలో, భీమ్‌గల్‌లో విధులు నిర్వర్తించనున్న ఉద్యోగులు భీమ్‌గల్‌ మున్సిపల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ కేంద్రంలో పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. ఈ నెల 7, 8 తేదీల్లో ఆయా కార్యాలయాల పని వేళల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకోవాలని, ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది 8వ తేదీన పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం వినియోగించుకోవచ్చని కలెక్టర్‌ తెలిపారు.

గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలి
1
1/1

గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement