
మాన్‌ధన్ యోజన.. రైతులకు భరోసా
మీకు తెలుసా?
కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన ద్వారా వయసు పైబడిన రైతులకు సామాజిక భద్రత కల్పిస్తోంది. మలిదశలో ఏ పని చేయలేని రైతులకు ఈ పథకం కొంత ఆసరాగా నిలుస్తుంది. 2019, సెప్టెంబర్‌లో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు.
● ఈ పథకానికి గరిష్టంగా ఐదెకరాలలోపు సాగు భూమి ఉండి, 18–40 ఏళ్ల లోపు వయసున్న రైతులు అర్హులు.
● అధికారులు, ఉద్యోగులు, వైద్యులు, న్యాయవాదులు, ఇంజినీర్లు, ఇతర వృత్తి నిపుణులు ఈ పథకానికి అనర్హులు.
● రైతులు కామన్ సర్వీస్ కేంద్రాల్లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.
● రైతు ఫొటో, నివాస ధ్రువీకరణ పత్రం, వయస్సు నిర్ధారణ, సాగు భూమి, ఆధార్ కార్డు తదితర పత్రాలు సమర్పించాలి.
● కేంద్ర పీఎంకేఎం పోర్టల్‌లో వివరాలు నమోదు చేశాక రైతుల మొబైల్‌కు సమాచారం అందుతుంది. ప్రత్యేకంగా పింఛన్ ఖాతాను తెరిచి కార్డు అందిస్తారు. వివరాలు నమోదు చేసినందుకు మీసేవా కేంద్రానికి రూ. 30 ప్రభుత్వమే చెల్లిస్తుంది.
● ప్రతి నెలా సదరు కేంద్రంలోనే కిస్తీ చెల్లించవచ్చు నెల వారీగా లేదా 3,4,6 నెలలకోసారి కిస్తీలు చెల్లించవచ్చు.
● సకాలంలో చెల్లించకుంటే మరుసటి నెలలో అపరాధ రుసుముతో చెల్లించాలి. వయసు మేరకు ప్రీమియం ఉంటుంది.
● రైతులు 60 ఏళ్లు నిండే వరకు కిస్తీలు చెల్లించాలి. ఆ తర్వాత ప్రతి నెలా రూ. 3వేల చొప్పున పింఛన్ అందజేస్తారు.
● రైతు మరణిస్తే జీవిత భాగస్వామికి సగం పింఛన్ అందజేస్తారు.
● పథకాన్ని కొనసాగించేందుకు కనీసం ఐదేళ్లపాటు తనవంతు వాటా ప్రీమియం నిర్దేశిత తేదీ ప్రకారం చెల్లించాలి.
– సదాశివనగర్(ఎల్లారెడ్డి)