
ట్రాక్టర్ కింద పడి బాలుడి మృతి
రాజంపేట: ప్రమాదవశాత్తు ట్రాక్టర్ టైరు కింద పడి బాలుడు మృతి చెందిన ఘటన రాజంపేట మండలం గుడితండా గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై పుష్పరాజ్ ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన మాలోత్ అనిత గణేశ్‌లకు ముగ్గురు పిల్లలు. చిన్న కుమారుడైన మాలోత్ చిన్న(3) శనివారం సాయంత్రం ఇంటి వద్ద పార్క్ చేసి ఉన్న ట్రాక్టర్‌పై కూర్చుని ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో బాలుడు ట్రాక్టర్ గేర్‌ను న్యూట్రల్ మార్చడంతో కదిలింది. ట్రాక్టర్ ట్రాలీతోపాటు రివర్స్‌లో వెనక్కి వెళ్తుండడంతో భయాందోళనకు గురైన బాలుడు ట్రాక్టర్‌పై నుంచి కింది దూకే ప్రయత్నంలో టైర్ కిందపడ్డాడు. గమనించిన కుటుంబీకులు వెంటనే బాలుడిని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్సై తెలిపారు.
నీట మునిగి వృద్ధురాలు..
మాచారెడ్డి: పాల్వంచ మండలం ఇసాయిపేటలో కోలాపురం లక్ష్మి(62) అనే వృద్ధురాలు ఆదివారం నీట మునిగి మృతి చెందినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. కొద్ది రోజులుగా మతిస్థిమితం కోల్పోయిన వృద్ధురాలు శనివారం రాత్రి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఆదివారం చెరువులో శవమై తేలింది. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.
చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి ..
మాక్లూర్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో గుర్తు తెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మాక్లూర్ మండలం అడవి మామిడిపల్లిలో ఓ వ్యక్తి భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. మూడు రోజుల క్రితం అతను అనారోగ్యానికి గురికావడంతో గమనించిన స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై కోరారు.