‘ఐడీ’ కావాలంటే.. చేయి తడపాల్సిందే! | - | Sakshi
Sakshi News home page

‘ఐడీ’ కావాలంటే.. చేయి తడపాల్సిందే!

Jan 11 2024 7:48 AM | Updated on Jan 11 2024 11:47 AM

- - Sakshi

సుభాష్‌నగర్‌: రాష్ట్రంలోని గ్రామ రెవెన్యూ సహాయకులను(వీఆర్‌ఏ) పలు శాఖల్లో సర్దుబాటు చేసినా.. వారికి ఎంప్లాయీ ఐడీలు ఇచ్చేందుకు ట్రెజరీ ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఎంప్లాయీ ఐడీలు ఇవ్వాలని ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన విషయంతెలిసిందే. వీరికి ఎంప్లాయీ ఐడీలు ట్రెజరీశాఖ నుంచి ఇవ్వాల్సి ఉంటుంది.

ఐదునెలలుగా జీతాలు లేక ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్న పూర్వ వీఆర్‌ఏల నుంచి వసూలు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో ఉద్యోగి నుంచి రూ. 2వేల వరకు డిమాండ్‌ చేసి తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. చేయి తడపకుంటే ఎంప్లాయీ ఐడీ ఇచ్చేందుకు కొర్రీలు పెడుతుండడంపై పూర్వ వీఆర్‌ఏలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలోని 1643 మంది వీఆర్‌ఏలు ఉన్నారు. అందులో 201 మందిని వేరే జిల్లాలకు బదిలీ చేశారు. మరో 420 మంది వారసత్వ ఉద్యోగాల విషయంలో స్పష్టమైన నిర్ణయం వెలువడకపోవడంతో వారు రెవెన్యూశాఖలోనే కొనసాగుతున్నారు. మిగతా 1022 మందిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేశారు. విద్యార్హత ఆధారంగా జూనియర్‌ అసిస్టెంట్‌, రికార్డ్‌ అసిస్టెంట్‌ ఇతర హోదాల్లో నియమించారు.

వీరికి గతేడాది ఆగస్టు నుంచి గత ప్రభుత్వం జీతాలు చెల్లించలేదు. పలుమార్లు కలెక్టర్లు, మంత్రులు, ముఖ్యమంత్రినిసైతం విన్నవించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రులు, సీఎం రేవంత్‌రెడ్డి రెవెన్యూశాఖపై పలుమార్లు సమీక్ష నిర్వహించారు. ఎంప్లాయీ ఐడీలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.

రూ. 20 లక్షల వరకు..
జిల్లాలోని వివిధశాఖల్లో సుమారు 1022 మంది పూర్వ వీఆర్‌ఏలు వివిధశాఖల్లో ఐదు నెలలుగా ఉద్యోగాలు చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో ఎంప్లాయీ ఐడీలు తీసుకునేందుకు జిల్లా ఖజానాశాఖలో సంప్రదిస్తున్నారు. ఇదే ఆసరాగా చేసుకున్న ఆ శాఖ ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు.

ఒక్కో ఎంప్లాయీ ఐడీ ఇచ్చేందుకు రూ. 2వేల వరకు డిమాండ్‌ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ లెక్కన సుమారు రూ. 20 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే చాలామంది రూ. 2వేల చొప్పున చెల్లించినట్లు తెలిసింది.

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పూర్వ వీఆర్‌ఏలు
పూర్వ వీఆర్‌ఏలకు ఐదు నెలలుగా జీతాలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఇతర జిల్లాలు, మండలాలకు బదిలీపై వెళ్లిన వారు అద్దెలు, ఇంటి ఖర్చులు, విద్య, వైద్యం కోసం అప్పులు చేశారు. ఈ క్రమంలో జిల్లా ఖజానాశాఖ ఉద్యోగులు ఎంప్లాయీ ఐడీ కోసం రూ. 2వేలు వసూలు చేస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పుడే ఇంత మొత్తంలో డిమాండ్‌ చేస్తే.. నాలుగు నెలల సప్లిమెంటరీ జీతంతోపాటు ప్రస్తుత నెల జీతం తయారు చేసేందుకు ఇంకెంత అడుగుతారోనని వారు ఆందోళన చెందుతున్నారు. దాదాపు రూ. 10వేల వరకు డిమాండ్‌ చేస్తారని కూడా చర్చ జరుగుతోంది.

నా దృష్టికి రాలేదు
పూర్వ వీఆర్‌ఏల నుంచి ఎంప్లాయీ ఐడీల కోసం డబ్బులు వసూలు చేస్తున్నట్లు తన దృష్టికి రాలేదు. ఎవరైనా వసూలు చేసినట్లు ఫిర్యాదు చేస్తే సదరు ఉద్యోగిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఐడీ కోసం ఎవరూ డబ్బులు చెల్లించాల్సిన అవసరంలేదు. – దశరథ్‌, డీడీ, ట్రెజరీశాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement