అధికారుల తప్పిదం.. రైతుల ఆందోళన
మోపాల్ : మండలంలోని నర్సింగ్‌పల్లి గ్రామంలో యూరియా కోసం రైతులు గురువారం ఆందోళన చేపట్టారు. ఫర్టిలైజర్ యాప్‌లో బుకింగ్ చేసుకున్న వారికి యూరియా లేదనడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సింగ్‌పల్లి మా పల్లె ఎఫ్‌పీవో డీలర్‌కు 450 బస్తాల లోడ్‌తో ఉన్న యూరియా వచ్చింది. యాప్‌లో ఐడీ జనరేట్ చేయకుండానే సదరు డీలర్ యూరియాను రైతులకు విక్రయించారు. యూరియా పూర్తిగా అమ్మిన తర్వాత యాప్‌లో ఐడీ జనరేట్ చేయడంతో 450 బస్తాలు ఉన్నట్లు చూపించింది. దీంతో రైతులు బుకింగ్ చేసుకున్నారు. యూరియా కోసం వచ్చి చూడగా అక్కడ లేకపోగా, గోదామునకు తాళం వేసి ఉంది. దీంతో ఆగ్రహించిన రైతులు అక్కడే ధర్నా చేపట్టారు. పదిరోజులుగా యూరియా కోసం ఎదురుచూస్తున్నామని, తాము బుకింగ్ చేసుకున్న యూరియాను ఎవరికి విక్రయించారని మండిపడ్డారు. ఎస్సై సుస్మిత అక్కడికి చేరుకొని రైతులను సముదాయించే ప్రయత్నం చేయగా, వారు వినిపించుకోలేదు. దీంతో ఇన్‌చార్జి ఏవో జాదవ్ హీరాతో ఫోన్లో మాట్లాడగా, యాప్‌లో బుకింగ్ చేసుకున్న రైతులకు శుక్రవారం ఇస్తామని చెప్పడంతో ఆందోళనను విరమించారు.
కాగా, మండలంలో అధిక ధరకు యూరియాను విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇన్‌చార్జి ఏవో, డీలర్ తప్పిదం వల్లే యూరియా సమస్య ఎదురైందని తెలిసింది. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి, ఉన్నతాధికారులు స్పందించి మండలానికి పూర్తిస్థాయి ఏవోను కేటాయించాలని రైతులు కోరుతున్నారు.
అధికారుల తప్పిదం.. రైతుల ఆందోళన


