గందరగోళం | - | Sakshi
Sakshi News home page

గందరగోళం

Feb 27 2026 7:46 AM | Updated on Feb 27 2026 7:46 AM

గందరగ

గందరగోళం

ఈ–నామ్‌

సుభాష్‌నగర్‌ : నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పసుపు కొనుగోళ్లు బహిరంగ వేలం (ఓపెన్‌ ఆక్షన్‌) ద్వారా గురువారం చేపట్టారు. రెండ్రోజులుగా శ్రద్దానంద్‌ గంజ్‌లో పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలు నిలిచిపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేసి కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయంలోకి దూసుకెళ్లే క్రమంలో తలుపులకు ఉన్న అద్దాలు పగిలిపోయాయి. ఈ–నామ్‌ 1.0 ను ఈ–నామ్‌ 2.0 గా మార్చడంతో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. సమస్య పరిష్కారానికి మార్గం కనిపించకపోగా, మరో వైపు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రైతులు, వ్యాపారులతో జాయింట్‌ మీటింగ్‌ పెట్టి అందరి సమ్మతితో యార్డులో కొనుగోళ్లను మళ్లీ పాత పద్ధతిలోనే చేపడుతున్నారు. ఈ సీజన్‌లో మార్కెట్‌లో ఇప్పటివరకు 1.77 లక్షల క్వింటాళ్ల పసుపును కొనుగోలు చేశారు.

‘ఈ–నామ్‌’ అమల్లో దేశానికే ఆదర్శం..

కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని మార్కెట్లను అనుసంధానం చేస్తూ 2014 ఏప్రిల్‌లో ఈ–నామ్‌ 1.0 ను ప్రారంభించారు. ఈ–నామ్‌ అమల్లో దేశంలోనే నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ ఆదర్శంగా నిలిచి ప్రధాని చేతుల మీదుగా అప్పటి సెలక్షన్‌ గ్రేడ్‌ సెక్రెటరీ సంగయ్య అవార్డును అందుకున్నారు. అటువంటి మార్కెట్‌లోనే ఈ–నామ్‌ 2.0 గా మార్పుతో సాంకేతిక సమస్యలు ఎదురై కొనుగోళ్లు నిలిచిపోయాయి. 2026 ఫిబ్రవరి 25న ఈ–నామ్‌ 2.0గా మార్పు చేయడం, దీనిపై ఉద్యోగులు, వ్యాపారులు, కమీషన్‌ ఏజెంట్లకు శిక్షణ, అవగాహన లేకపోవడం.. అదేసమయంలో పసుపు సీజన్‌ కావడంతో పరిస్థితి సంకటంగా మారింది.

ఓపెన్‌ ఆక్షన్‌తో రైతులకే నష్టం..!

శ్రద్ధానంద్‌ గంజ్‌లో పసుపు కొనుగోళ్లు ఓపెన్‌ ఆక్షన్‌ ద్వారా చేపట్టడం వల్ల రైతులకు తీవ్రంగా నష్టం జరిగే అవకాశముంది. ఈ పద్ధతిలో కొనుగోళ్లు జరిపితే మూడు నుంచి నాలుగు రోజుల సమయం అవుతుంది. రైతులు మార్కెట్‌లో ఉండాలన్నా.. రోజూ మార్కెట్‌కు రావాలన్నా ఇబ్బందులు ఎదురవుతాయి. అంతేగాకుండా పెద్ద మొత్తంలో పసుపు పంట వస్తుంది. అందువల్ల ఓపెన్‌ ఆక్షన్‌లో తక్కువ మంది వ్యాపారులు పాల్గొంటారు. ఈక్రమంలో పసుపు ధరలు పడిపోయే ఆస్కారం ఉంటుంది.

మార్చి 3లోగా పరిష్కారం సాధ్యమేనా..?

నిజామాబాద్‌ మార్కెట్‌యార్డులో సుమారు 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఓపెన్‌ ఆక్షన్‌కు తెరలేపారు. బుధ, గురువారాల్లో మార్కెట్‌కు సుమారు 30 వేల బస్తాల పసుపు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ–నామ్‌ 2.0 మార్పు చేయడంతో ఒక్కో లాట్‌ ఐడీ ఇవ్వడానికి 10 నుంచి 15 నిమిషాలు అవుతుంది. అలాంటిది నిజామాబాద్‌ మార్కెట్‌లో పసుపు సీజన్‌లో 2 వేల వరకు లాట్‌ ఐడీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈవిషయాన్ని మార్కెట్‌ అధికారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, మంత్రులు, ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ–నామ్‌ 1.0 అమలు చేయాలని, లేకుంటే మార్కెట్‌లో కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయే ఆస్కారముందని తేల్చిచెప్పారు. నిజామాబాద్‌ మార్కెట్‌కు ఫిబ్రవరి 28, మార్చి 1, 2, 3 తేదీల్లో సెలవులు ఉన్నాయి. మార్చి 3లోపు ఈ సమస్యకు పరిష్కారం చూపాలి. లేకుంటే ఈ ప్రభావం నాలుగైదు జిల్లాల రైతులపై పడనుంది.

కాగా ఓపెన్‌ ఆక్షన్‌లో జరుగుతున్న పసుపు కొనుగోళ్లను మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ముప్ప గంగారెడ్డి, అధికారులు పరిశీలించారు.

మార్కెట్‌లో ఓపెన్‌ ఆక్షన్‌ ద్వారా కొనుగోళ్లు సజావుగా జరిగాయని, శుక్రవారం కూడా అదే పద్ధతిలో కొనుగోలు చేస్తామని సెలక్షన్‌ గ్రేడ్‌ సెక్రెటరీ అపర్ణ తెలిపారు. ఈ–నామ్‌ 2.0లో సాంకేతిక సమస్యల కారణంగా కొనుగోళ్లు చేపట్టలేదని, రైతులు ఈవిషయాన్ని గమనించి మార్కెట్‌ కమిటీకి సహకరించాలని ఆమె కోరారు.

ప్రజాప్రతినిధుల జోక్యంతోనే పరిష్కారం..

కేంద్ర ప్రభుత్వం ఈ–నామ్‌ 2.0 మార్పు వల్ల జరుగుతున్న పరిణామాలపై రాష్ట్ర మంత్రులతోపాటు కేంద్రంలోని ప్రభుత్వ పెద్దలు జోక్యం తప్పనిసరైంది. ముఖ్యంగా నిజామాబాద్‌ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న అర్వింద్‌ ధర్మపురి పసుపు బోర్డు ఎలాగైతే సాధించారో.. అంతే పట్టుదలతో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రికి నేరుగా సమస్యను విన్నవిస్తే తప్ప సమస్య పరిష్కారమయ్యే అవకాశం లేదని మార్కెటింగ్‌శాఖ వర్గాల ద్వారా తెలిసింది. ఈ–నామ్‌ 1.0 అమలే ఈ సమస్యకు తాత్కాలిక పరిష్కారం.

రైతుల ఆందోళనపై జేడీ ఆరా..

మార్కెట్‌యార్డులో నెలకొన్న రైతుల ఆందోళన, నిలిచిపోయిన కొనుగోళ్లు, ఇతరత్రా అంశాలపై మార్కెటింగ్‌శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ మల్లేశం, సెలక్షన్‌ గ్రేట్‌ సెక్రెటరీ అపర్ణ, గ్రేడ్‌–1 సెక్రెటరీ విజయ్‌కిషోర్‌, ఇతర అధికారులతో సమీక్షించారు. ఈ–నామ్‌ 2.0లో తలెత్తుతున్న సమస్యలు, సాంకేతిక కారణాలు, పరిష్కార మార్గాలు, ఇతర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రితో పాటు ప్రిన్సిపల్‌ సెక్రెటరీ, కమిషనర్‌, మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు.

గందరగోళం1
1/2

గందరగోళం

గందరగోళం2
2/2

గందరగోళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement