రుణమాఫీ చేయరా? | - | Sakshi
Sakshi News home page

రుణమాఫీ చేయరా?

Nov 12 2026 12:07 AM | Updated on Nov 12 2026 12:07 AM

● ఎల్‌నినోతో పంటసాగుకు ప్రతికూలం ● వర్షాభావంతో దిగుబడులపై ప్రభావం ● రుణాలు చెల్లించలేని స్థితిలో రైతాంగం ● మాఫీ చేయాలని రైతుల వేడుకోలు

నిర్మల్‌: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడం, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో జిల్లాలో వ్యవసాయరంగం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈసారి పెట్టుబడులూ చేతికందే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాలు రైతుల మెడకు గుదిబండలా మారనున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన కరువు జాబితాలో జిల్లాలోని తొమ్మిది మండలాలే ఉన్నాయి. ఆయా మండలాల్లోని రైతుల రుణాల చెల్లింపు గడువు పెంపు, వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణాలు ఇవ్వడం లాంటి అవకాశాలే కల్పించారు. కానీ.. పంటలే సాగు చేయనప్పుడు పైసలెట్లా కట్టేదని రైతులు వాపోతున్నారు.

సాధారణ వర్షపాతం కంటే తక్కువే..

జిల్లాలో జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకు సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షం కురిసింది. జిల్లాలో సాధారణ వర్షపాతం 966.3 మి.మీ. కాగా.. 731 మి.మీ. మాత్రమే నమోదైంది. ఈలెక్కనే 235.3 మి.మీ. తక్కువ వర్షపాతం నమోదై, 24 శాతం లోటు ఏర్పడింది. పలు మండలాల్లో సాధారణం కంటే అతితక్కువ వర్షాలు కురిశాయి. ఈమేరకు ప్రభుత్వం తొమ్మిది మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించింది. ఇందులో ఖానాపూర్‌ మండలాన్ని తీవ్ర కరువు ప్రభావిత మండలంగా గుర్తించింది. కుభీర్‌, భైంసా, కుంటా ల, నిర్మల్‌అర్బన్‌, సోన్‌, లక్ష్మణచాంద, కడెం, దస్తురాబాద్‌ మండలాలను మోస్తరు కరువు ప్రభావిత ప్రాంతాలుగా పేర్కొంది. ఎల్‌నినో ప్రభావం, వర్షపాత లోటు ఈ ప్రాంతాల్లో వ్యవసాయ రంగంపై ప్రభావం చూపనున్నట్లు వెల్లడించారు.

పంటలు చేతికొచ్చే పరిస్థితి లేదు

జిల్లాలో ప్రధానంగా వరి, పత్తి, సోయా సాగు చేస్తున్నారు. వర్షాలపై ఆధారపడి సాగు చేసే రైతులకు ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఎల్‌నినో మున్ముందు మరింత ఎఫెక్ట్‌ చూపుతుందని ప్రభుత్వమే ప్రకటించింది. ఇప్పటికే ఖానాపూర్‌, కుంటాల, తానూరు, దస్తురాబాద్‌ తదితర మండలాల్లో పంటలు ఎండిపోయాయి. మరికొన్ని చోట్ల ఆశించిన దిగుబడి రావడం లేదు. చాలామంది రైతులు పంట చేతికొచ్చేదాకా నమ్మకం లేదంటున్నారు.

రుణాలు ఎలా తీర్చాలని రైతుల ఆందోళన

విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల కోసం రైతులు బ్యాంకులతో పాటు ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద రుణాలు తీసుకున్నారు. ఆశించిన దిగుబడులు రాకపోవడంతో వారు రుణాలు చెల్లించే పరిస్థితి లేదు. ఎల్‌నినో కారణంగా పంటలు పండే పరిస్థితే లేదని సర్కారే చెబుతోంది. అలాంటప్పుడు ఈ ఏడాది రుణాలు ఎలా చెల్లించాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. మూడేళ్లపాటు కాలపరిమితి పెంచినా ఈ ఏడాది పంటలే లేనందున ఈసారికి రుణాలు మాఫీ చేయాలని కోరుతున్నారు.

కరువు మండలంగా ప్రకటించాలి

మాకున్న ఆరెకరాల్లో పత్తి సాగు చేసినం. ఎకరాకు రెండు నుంచి మూడు క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. మా తానూరు మండలాన్నీ కరువు ప్రాంతంగా ప్రకటించాలి. అలాగే, ఈ ఏడాది పంట రుణాలు మాఫీ చేయాలి.

– గంగాధర్‌, రైతు, ఉమ్రి(కె), తానూరు

పంటరుణాలు మాఫీ చేయాలి

ఎల్‌నినో కారణంగా పంటలు సాగు చేయొద్దని చెబుతున్న ప్రభుత్వం రైతుల పంటరుణాలు మాఫీ చేయాలి. పంటలే లేనప్పుడు రైతులు రుణాలు ఎలా చెల్లిస్తారో సర్కారు ఆలోచించాలి. పంటరుణాలు మాఫీ చేసి ఆదుకోవాలి.

– గంగారెడ్డి, బీకేఎస్‌ భైంసా డివిజన్‌ కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement