ఫలితాలు ‘పది’లం కోసం.. | - | Sakshi
Sakshi News home page

ఫలితాలు ‘పది’లం కోసం..

Nov 4 2026 12:09 AM | Updated on Nov 4 2026 12:09 AM

● వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యం ● ప్రారంభమైన ప్రత్యేక తరగతులు ● 90 రోజుల ప్రణాళిక

లక్ష్మణచాంద:విద్యార్థి దశలో పదో తరగతి అత్యంత ముఖ్యమైనది. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు ఈనెల 2 నుంచి సాయంత్రం ప్రత్యేక తరగతులు ప్రారంభించాలని రాష్ట్ర పాఠశాల విద్యాడైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ ఆదేశాలు జారీ చేశారు.

ప్రత్యేక తరగతులు షురూ..

రాష్ట్ర పాఠశాల విద్యా డైరెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం ప్రత్యేక తరగతులు ప్రారంభమయ్యాయి. గతేడాదికన్నా మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు. గతేడాది జిల్లాలో 9,743 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, వారిలో 9,642 మంది ఉత్తీర్ణులయ్యారు. 98.96 శాతం ఫలితాలతో జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది. ఈసారి మరింత మెరుగైన ఫలితాలు సాధించి జిల్లాను ముందు వరుసలో నిలపాలని ఉపాధ్యాయులు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు.

90 రోజుల కార్యాచరణ..

వచ్చే ఏడాది మార్చిలో జరిగే వార్షిక పరీక్షలకు ఇప్పటి నుంచే విద్యార్థులను సంసిద్ధం చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. జనవరి 10 నాటికి అన్ని సిలబస్‌లు పూర్తి చేయాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. సిలబస్‌ పూర్తయిన తర్వాత పునఃశ్చరణ తరగతులు నిర్వహించనున్నారు. ఈనెల 2న ప్రారంభమైన ప్రత్యేక తరగతులు డిసెంబర్‌ 31 వరకు కొనసాగుతాయి. ప్రతిరోజూ సాయంత్రం 4.15 నుంచి 5.15 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. జనవరి 1 నుంచి 30 వరకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. చురుకై న విద్యార్థులను మరింత ప్రోత్సహించడంతోపాటు, చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు అధికారులు తెలిపారు.

పకడ్బందీగా అమలు

పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్‌ భవేశ్‌మిశ్రా సూచనలతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం ప్రత్యేక తరగతులు ప్రారంభించాం. ఈ ప్రత్యేక తరగతులు పకడ్బందీగా అమలు చేయాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశాం. ఉత్తమ ఫలితాల సాధన లక్ష్యంగా ముందుకు సాగి గత ఏడాది కంటే మరింత మెరుగైన లక్ష్యాలు సాధించేందుకు ఉపాధ్యాయులు విద్యార్థులను సన్నద్ధం చేయాలి.

– భోజన్న, డీఈవో

నిత్యం పర్యవేక్షణ

పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ అదనపు చర్యలు తీసుకుంటోంది. విద్యార్థులను వారి సామర్థ్యాల ఆధారంగా ఏ, బీ, సీ గ్రూపులుగా విభజించారు. ప్రతీ ఉపాధ్యాయుడికి కొంతమంది విద్యార్థులను కేటాయించారు. ఇన్‌చార్జి ఉపాధ్యాయుడు ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు ఫోన్‌ చేసి విద్యార్థులను నిద్రలేపడం, తల్లిదండ్రులతో మాట్లాడటం వంటి పనులు చేయాల్సి ఉంటుంది.

ఐదేళ్లలో పది ఫలితాలు...

సంవత్సరం పాఠశాలలు హాజరు ఉత్తీర్ణత శాతం స్థానం

2021–22 231 9,642 9,423 97.73 2

2022–23 233 9,071 8,980 99.00 1

2023–24 230 8,908 8,823 99.05 1

2024–25 235 9,123 8,822 96.70 15

2025–26 241 9,743 9,642 98.96 3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement