కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వని కేంద్రం జిల్లాలో ఏటా తగ్గుతున్న లబ్ధిదారుల సంఖ్య కఠిన నిబంధనలతో జిల్లాలో 43,219 మంది దూరం
నిర్మల్‌చైన్‌గేట్: కఠిన నిబంధనల కారణంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం లబ్ధిదారుల సంఖ్య జిల్లాలో ఏటా తగ్గుతూ వస్తోంది. పథకం ప్రారంభమైనప్పటి నుంచి గడిచిన ఏడేళ్లలో 43,219 మందికిపైగా రైతులు ఈ పథకానికి అర్హత కోల్పోయారు. అదే సమయంలో కటాఫ్ తేదీని మార్చకపోవడంతో కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులకు పెట్టుబడిసాయం అందకుండా పోతోంది. అనర్హుల తొలగించే విషయంలో కేంద్ర ప్రభుత్వం చురుకుగా ఉన్నా, కొత్త దరఖాస్తుదారులకు అవకాశం కల్పించడంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. జిల్లాలో ఈ ఏడేళ్లలో 20 వేల మందికిపైగా కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందారు.
కొత్త పట్టాదారుల ఎదురుచూపు
జిల్లాలో 20 వేల మందికిపైగా కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు ఉన్నారు. వీరు పీఎం కిసాన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఎవరిని సంప్రదించాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఏవోలు, ఏఈవోలను కలిసినా స్పష్టమైన సమాధానం రావడం లేదు.
వారసత్వం కింద మినహాయింపు
కటాఫ్ తేదీ తర్వాత భూములు కొన్న రైతులకు సా యం అందడం లేదు. అయితే అనువంశికంగా భూములు పొందినవారికి దరఖాస్తు అవకాశం ఉంది. అయితే ఆ భూమి గతంలో పథకం కింద లబ్ధి పొందినట్లయితేనే కొత్త దరఖాస్తుదారులు అర్హులవుతారు.
ఏటా రూ.6 వేల పెట్టుబడి..
చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడిసాయం అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించింది. ఐదెకరాలలోపు రైతులకు విడతకు రూ.2 వేల చొప్పున, సంవత్సరానికి మూడు విడతల్లో మొత్తం రూ.6 వేలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తోంది. పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 23 సార్లు ఈ మొత్తాన్ని జమ చేసింది.
లబ్ధిదారుల సంఖ్యలో క్షీణత
2019 ఫిబ్రవరిలో పథకం ప్రారంభమైనప్పుడు జిల్లాలో 1,12,151 మంది రైతులకుసాయం అందింది. తర్వాత నిబంధనలు కఠినతరం చేయడంతో లబ్ధిదారుల సంఖ్య క్రమంగా తగ్గుతూ తాజాగా 68,932కి చేరుకుంది. ప్రారంభంలో సెల్ఫ్ డిక్లరేషన్ ఆధారంగా నమోదు జరిగినా, తర్వాత ఈ–కేవైసీ తప్పనిసరి చేశారు. 2019, ఫిబ్రవరి 1 తర్వాత కటాఫ్ తేదీని మార్చకపోవడం కూడా కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా చాలామంది రైతులు సాయానికి దూరమయ్యారు.


