ముధోల్: ముధోల్ ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యసేవలు మరింత మెరుగుపర్చి రోగులకు నాణ్యమైన చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. ముధోల్ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. వివిధ విభాగాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది సంఖ్య, ప్రతీరోజు చికిత్స కోసం వస్తున్న రోగుల వివరాలు, వారికి అందిస్తున్న వైద్య సేవల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రక్త పరీక్షల గది, మందుల పంపిణీ కేంద్రం తదితర విభాగాలను పరిశీలించారు. ప్రతీరోగికి నాణ్యమైన వైద్యం అందించాలని వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు. ఆస్పత్రి భవనం పాతదైనందున అవసరమైన మరమ్మతులు, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఆస్పత్రి మార్చురీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, నూతన భవన నిర్మాణానికి సంబంధించి ఉన్నతాధికారులతో సంప్రదించి అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. అనంతరం ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. శిథిలావస్థకు చేరిన భవనం తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నూతన అదనపు తరగతుల నిర్మాణానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. 5వ తరగతి విద్యార్థులతో కలెక్టర్ నేరుగా మాట్లాడారు. ప్రతీరోజు పాఠశాలకు రావాలన్నారు. స్నేహితులైవరైనా బడికి రానట్లయితే, వారిని కూడా తీసుకొని రావాలన్నారు. లెక్కలు సులభంగా అర్థమయ్యేలా మెలకువలను నేర్పి, కొన్ని లెక్కలు చేయించారు. ఇంగ్లిష్ పదాలను వ్యతిరేక క్రమంలో చదివిపించారు. తనిఖీలో డీఈవో భోజన్న, డీసీహెచ్‌ఎస్ కాశీనాథ్, తహసీల్దార్ శ్రీలత, ఎంపీడీవో లవకుమార్, డీఎల్పీవో లక్ష్మణ్, సర్పంచ్ షబానా బేగాం తదితరులు పాల్గొన్నారు.


