నిర్మల్‌టౌన్: ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే సన్న బియ్యం విక్రయించాలని, అధిక ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌరసరఫరాల అధికారి రాజేందర్ వ్యాపారులను హెచ్చరించారు. పట్టణంలోని పలు బియ్యం దుకాణాలను మంగళవారం తనిఖీ చేశారు. బియ్యం విక్రయాల ధరలు, వ్యాపారులు పాటిస్తున్న ధరల వివరాలు పరిశీలించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల సూచికను ప్రతీవ్యాపారి తప్పనిసరిగా పాటించాలని సూచించారు. వినియోగదారులకు నాణ్యమైన బియ్యాన్ని నిర్ణీత ధరలకే అందించాలని, ధరల విషయంలో ఎలాంటి అక్రమాలకు పాల్పడొద్దని స్పష్టం చేశారు. తనిఖీల్లో ఏఎస్‌వో సాగర్, లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్ శంకర్ పాల్గొన్నారు.


