కరువును ఎదుర్కొనేలా ఉపాధి | - | Sakshi
Sakshi News home page

కరువును ఎదుర్కొనేలా ఉపాధి

Nov 3 2026 12:39 AM | Updated on Nov 3 2026 12:39 AM

9 మండలాల్లో వీబీజీ రామ్‌జీ ప్రత్యేక ప్రణాళిక అర్హులందరికీ జాబ్‌కార్డులు ఏడాదికి 125 రోజుల పని.. రోజుకు రూ.308 వేతనం.. గ్రామాల్లో అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ‘సాక్షి’తో డీఆర్డీవో విజయలక్ష్మి

భైంసా: ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది జిల్లాలో 24 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీంతో పంటల సాగు విస్తీర్ణం, దిగుబడి తగ్గింది. యాసంగిలో పంటలు వేయొద్దని ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలో వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని జిల్లాలో కరువు మండలాలను ఖరారు చేసింది. ఖానాపూర్‌లో తీవ్ర కరువు, 8 మండలాల్లో మోస్తరు కరువు ఉన్నట్లు టీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో కరువు మండలాల్లో రైతులు, రైతు కూలీలకు పని కల్పించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వీబీజీ రామ్‌జీ పథకంలో ఎక్కువ మందికి పనికల్పించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు డీఆర్డీవో విజయలక్ష్మి తెలిపారు. ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలు వెల్లడించారు.

సాక్షి: జిల్లాలో కరువు పరిస్థితుల నేపథ్యంలో ఉపాధి కల్పనకు ఎలాంటి ప్రణాళిక రూపొందిస్తున్నారు?

డీఆర్డీవో: జిల్లాలోని కరువు ప్రభావిత మండలాల్లో గ్రామీణ కూలీలకు ఎక్కువ సంఖ్యలో ఉపాధి కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయ పనులు తగ్గడంతో గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి అవసరం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో వీబీజీ రామ్‌జీ పథకం ద్వారా గ్రామాల్లోనే పనులు కల్పించి కూలీలకు ఆర్థిక భరోసా కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. అవసరమైన చోట పనులను గుర్తించి, కూలీలు పని కోరినప్పుడు ఉపాధి కల్పించే దిశగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం.

సాక్షి: కరువు మండలాల్లో ప్రస్తుతం ఎంతమంది కూలీలు పనులకు వస్తున్నారు?

డీఆర్డీవో: జిల్లాలోని 9 కరువు ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం సుమారు 13 వేల మంది కూలీలు ఉపాధి పనులకు వస్తున్నారు. వీరికి గ్రామాల్లో అందుబాటులో ఉన్న పనుల ద్వారా ఉపాధి కల్పిస్తున్నాం. రానున్న రోజుల్లో మరింత మంది కూలీలు పనులకు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా పనులను గుర్తిస్తున్నాం. కూలీలకు పనులు కల్పించడంలో గ్రామ పంచాయతీలు, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నాం.

సాక్షి: అదనపు పనిదినాలు కేటాయించే అవకాశం ఉందా?

డీఆర్డీవో: అదనపు పనిదినాల కేటాయింపు ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. కరువు పరిస్థితులు, కూలీల అవసరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి వచ్చే మార్గదర్శకాలు, ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం.

సాక్షి: ఏడాదికి ఎన్ని రోజులు పని కల్పిస్తారు?

డీఆర్డీవో: వీబీజీ రామ్‌జీ పథకం కింద అర్హులైన కూలీలకు ఏడాదికి 125 రోజులు పని కల్పిస్తాం. వ్యవసాయ పనులు లేని సమయంలో ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కూలీలు తమ గ్రామాల్లోనే పనులు చేసుకుంటూ కుటుంబ అవసరాలకు ఆదాయం సమకూర్చుకోవచ్చు.

సాక్షి: కరువు మండలాల్లో ఎలాంటి పనులకు ప్రాధాన్యం ఇస్తారు?

డీఆర్డీవో: గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి కల్పించడంతోపాటు భవిష్యత్తులో రైతులకు ఉపయోగపడే శాశ్వత ఆస్తుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇందులో భాగంగా మట్టి రోడ్ల నిర్మాణం, ఫాంపాండ్లు, గడ్డి పెంపకం, పశువుల తొట్లు, బోరుబావుల రీచార్జి నిర్మాణాలు, ఇంకుడు గుంతలు, ఊటకుంటలు తదితర పనులు చేపడతాం. గ్రామాల్లో అవసరాలను గుర్తించి పనులను ఎంపిక చేస్తాం. ముఖ్యంగా వర్షపు నీటిని భూమిలోకి ఇంకించే నిర్మాణాలు చేపట్టడం ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయి.

సాక్షి: ఇంకా ఎంతమందికి జాబ్‌కార్డులు జారీ చేయనున్నారు?

డీఆర్డీవో: ఉపాధి పనులు చేయడానికి ఆసక్తి ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరికీ జాబ్‌కార్డులు జారీ చేస్తున్నాం. దీనికి ప్రత్యేకంగా సంఖ్యను నిర్దేశించలేదు. అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకుంటే నిబంధనల ప్రకారం పరిశీలించి జాబ్‌కార్డులు అందిస్తాం. గ్రామాల్లో అర్హులైన కూలీలను గుర్తించి వారికి పథకం వివరాలు తెలియజేయాలని క్షేత్రస్థాయి సిబ్బందికి సూచిస్తున్నాం. జాబ్‌కార్డు ఉన్న ప్రతీ కుటుంబం ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలి.

సాక్షి: కూలీలకు రోజువారీ వేతనం ఎంత చెల్లిస్తున్నారు?

డీఆర్డీవో: ప్రస్తుతం ఉపాధి కూలీలకు రోజుకు రూ.308 వేతనం చెల్లిస్తున్నారు. కూలీలు చేపట్టిన పనుల కొలతలు, నిబంధనల ప్రకారం వేతన చెల్లింపులు జరుగుతాయి. కూలీలు పనుల్లో పాల్గొని నిర్దేశించిన పని ప్రమాణాలను పాటించాలి. వేతన చెల్లింపుల్లో పారదర్శకత ఉండేలా సంబంధిత సిబ్బంది పర్యవేక్షణ చేపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement