నిర్మల్: ఓట్ చోరీ పేరిట ప్రతిపక్షాలు చేస్తున్న దాడిని తిప్పికొట్టడమే లక్ష్యంగా కమల దళం తెలంగాణలో మహాపాదయాత్రలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఉత్తర తెలంగాణలో బీజేపీ తొలి నిరసన కార్యక్రమంగా నిర్మల్‌లో మంగళవా రం కాషాయ కవాతు నిర్వహించనుంది. స్థానిక ఎమ్మెల్యే, బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్‌బన్సల్, కేంద్రమంత్రి బండి సంజయ్, రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, సహ ఇన్‌చార్జీలు అభయ్‌పాటిల్, రేఖాశర్మలతోపాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొననున్నారు.
భారీగా జనసమీకరణ..
హైదరాబాద్ తర్వాత ఉత్తర తెలంగాణ ప్రాంతంలో నిర్వహించనున్న తొలి నిరసన కార్యక్రమం కావడంతో నిర్మల్ మహాపాదయాత్రను విజయవంతం చేసేందుకు బీజేపీ శ్రేణులు శ్రమిస్తున్నాయి. భారీగా జనసమీకరణ చేపడుతున్నారు. నిర్మల్, ముధోల్, ఖానాపూర్ నియోజకవర్గాల నుంచి 50 వేలమందికిపైగా కార్యకర్తలు, జనాలను సమీకరించాలని పార్టీ నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, పవార్ రామారావు పటేల్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్‌రాథోడ్‌తోపాటు రాష్ట్ర, జిల్లా నాయకులు ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి కార్యకర్తలను సమాయత్తం చేశారు. సర్పంచులు, పార్టీ పదాధికారులు, కార్యకర్తల సమన్వయంతో పాదయాత్ర విజయవంతానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
శాంతినగర్ నుంచి వివేక్‌చౌక్ దాకా..
జిల్లాకేంద్రంలోని శాంతినగర్ చౌరస్తా నుంచి శివాజీచౌక్, జయశంకర్‌చౌరస్తాల మీదుగా వివేక్‌చౌక్ వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర మహాపాదయాత్ర నిర్వహించనున్నారు. రాష్ట్ర ఇన్‌చార్జిగా సునీల్ బన్సల్ తొలి నిర్మల్ పర్యటన నేపథ్యంలో స్వాగత ఏర్పాట్లను భారీగా చేపట్టారు.
ట్రాఫిక్ మళ్లింపు
నిర్మల్‌టౌన్: పట్టణంలో బీజేపీ ర్యాలీ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు. ర్యాలీ సందర్భంగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. భైంసావైపు నుంచి వచ్చే వాహనాలు తల్వేద మీదుగా గాజులపేట్ చేరుకుని నిర్మల్‌కు రావాలని, హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు కడ్తాల్, కొండాపూర్, ఎల్లపల్లి మీదుగా బంగల్‌పేట్ చేరుకోవాలని సూచించారు. ఖానాపూర్ నుంచి వచ్చే వాహనాలు కొండాపూర్, ఎల్లాపల్లి, బంగల్‌పేట్ మీదుగా పట్టణంలోకి చేరుకోవాలని తెలిపారు. వాహనదారులు ఈ మార్గాలను గమనించి పోలీసులకు సహకరించాలని నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ కోరారు.


