ఖానాపూర్‌లో కిష్కింధకాండ | - | Sakshi
Sakshi News home page

ఖానాపూర్‌లో కిష్కింధకాండ

Sep 21 2026 6:53 AM | Updated on Sep 21 2026 6:53 AM

● పట్టణం, పల్లెల్లో బెంబేలెత్తిస్తున్న కోతులు ● చిన్నారులు, వృద్ధులపై ప్రత్యక్ష దాడులు ● నియంత్రించాలని ప్రజల డిమాండ్‌

పంటలు, తోటలపై దాడులు..

ఖానాపూర్‌: ఖానాపూర్‌ పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. కోతుల గుంపులు జనావాసాల్లో యథేచ్ఛగా సంచరిస్తూ చిన్నారులు, మహిళలు, వృద్ధులుపై ప్రత్యక్ష దాడులు చేస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చేతిలో కవర్‌ కనిపిస్తే చాలు.. దానిని లాక్కునేందుకు ఎగబడుతున్నాయి. ఇళ్లలోకి చొరబడి వస్తువులను ధ్వంసం చేయడంతోపాటు ఆహార పదార్థాలను ఎత్తుకెళ్తున్నాయి. గతంలో జిల్లా కేంద్రానికే పరిమితమైన ఈ సమస్య గత కొన్నేళ్లుగా ఖానాపూర్‌ పట్టణంతోపాటు మారుమూల గ్రామాలకు విస్తరించింది. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులు, నిర్వాహకులపై కూడా దాడులు జరుగుతున్నాయి. విద్యార్థులకు రక్షణ కల్పించాలని తల్లిదండ్రులు పలుమార్లు కోరినా శాశ్వత పరిష్కారం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కోతుల భయంతో మహిళ మృతి..

కోతుల దాడుల భయం ఎంత తీవ్రంగా ఉందంటే 2024లో పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన లక్ష్మి అనే మహిళ కోతుల నుంచి తప్పించుకునే క్రమంలో మృతి చెందింది. ఈ నెల 10న విద్యానగర్‌కు చెందిన శ్రీనాథ్‌ అనే బాలుడిపై కోతులు దాడి చేసి గాయపర్చాయి. గత నెల 30న ఇంద్రనగర్‌కు చెందిన కిషన్‌ అనే యువకుడిపై దాడి చేసి గాయపర్చాయి. గత నెలలో గాంధీనగర్‌ కాలనీలో కత్తెరపాక రాజు, చంద్రకళ అనే మహిళలపై వరుస దాడులు జరిగాయి. ఇలాంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

పంటలపై దాడులు..

కోతుల బెడద జనావాసాలకే పరిమితం కాకుండా పంట పొలాలు, మామిడి, జామ తోటలకు కూడా విస్తరించింది. రైతులు కష్టపడి పండించిన పంటలను కోతుల గుంపులు ధ్వంసం చేస్తుండటంతో తీవ్ర నష్టం జరుగుతోంది. పంటలను కాపాడుకునేందుకు రాత్రింబవళ్లు పొలాల వద్ద కాపలా ఉండాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ఉచితంగా సోలార్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసి తమ పంటలను కాపాడాలని కోరుతున్నారు.

పునరావాసంపై దృష్టి పెట్టాలి

జిల్లాలో అటవీ ప్రాంతం అధికంగా ఉండటంతో కోతుల సంతతి గణనీయంగా పెరుగుతోందని ప్రజలు పేర్కొంటున్నారు. 2020లో జిల్లా కేంద్రంలో ప్రయోగాత్మకంగా మంకీ రీహాబిలిటేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి సంతతి నియంత్రణకు చర్యలు చేపట్టారు. ఈ విధానాన్ని మరింత విస్తృతంగా అమలు చేయడంతో పాటు ప్రత్యేక మంకీ క్యాచర్స్‌ బృందాలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రత్యేక బోనులు, ఉచ్చులు ఏర్పాటు చేసి కోతులను పట్టుకుని ఆహారం, నీరు సమృద్ధిగా ఉన్న అటవీ ప్రాంతాలకు తరలించాలని, అవసరమైన వాటిని పునరావాస కేంద్రాలకు తరలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

పట్టణం నుంచి తరలిస్తాం..

పట్టణ పరిధిలో కోతుల బెడద నియంత్రించేందుకు తగిన చర్యలు చేపడతాం. ఇప్పటికే ప్రజల నుంచి పలుమార్లు ఫిర్యాదులు వచ్చాయి. ఇటీవల పలు కాలనీల్లో రూ.3 లక్షలు ఖర్చుచేసి 600 కోతులను పట్టుకుని దూర ప్రాంతాలకు తరలించాం. దాడులు పెరుగుతున్న నేపథ్యంలో సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో సభ్యులతో చర్చించి కోతుల బెడద నియంత్రణకు ప్రత్యేకంగా నిధులు కేటాయించేలా చూస్తాం.

– సుందర్‌సింగ్‌, మున్సిపల్‌ కమిషనర్‌, ఖానాపూర్‌

తరలించినా మళ్లీ జనావాసాల్లోకే

కోతుల నియంత్రణకు పట్టణంతోపాటు గ్రామాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు వివిధ చర్యలు చేపడుతున్నారు. కొన్ని చోట్ల ప్రత్యేక బృందాలతో కోతులను పట్టి తరలిస్తుండగా, మరికొన్ని చోట్ల గొరిల్లా, కొండముచ్చు తదితర వేషధారణలతో వాటిని ఊళ్ల నుంచి పక్క గ్రామాలు, పంట పొలాలు, అటవీ ప్రాంతాల వైపు తరుముతున్నారు. మండలంలోని గోసంపల్లె గ్రామంలో మే నెలలో 100 కోతులను పాలకవర్గం సొంత ఖర్చుతో పట్టి సుదూర ప్రాంతాలకు తరలించారు. ఖానాపూర్‌ పట్టణంలో మున్సిపల్‌ ఆధ్వర్యంలో నెల క్రితం ఒక్కో కోతికి రూ.500 చొప్పున రూ.3 లక్షల ఖర్చుతో 600 కోతులను పట్టుకుని ఉట్నూర్‌–ఇందన్‌పల్లి చౌరస్తాలోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. అయితే కొద్ది రోజులకే మళ్లీ సంఖ్య పెరుగుతోందని ప్రజలు చెబుతున్నారు. అటవీ ప్రాంతాల్లో ఆహారం, నీటి కొరత కారణంగా కోతులు తిరిగి జనావాసాలు, రహదారులపైకి వస్తున్నాయని పేర్కొంటున్నారు. ఇక రోడ్లపైకి అకస్మాత్తుగా వచ్చే కోతుల కారణంగా వాహనదారులు ప్రమాదాలకు గురైన ఘటనలు కూడా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement