భైంసాటౌన్: పట్టణంలోని వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ తూముల దత్తాత్రి తెలిపారు. ఈ మేరకు ఆదివారం మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మంగళవారం జరుగనున్న గణేశ్ నిమజ్జన శోభాయాత్ర నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. శోభాయాత్ర మార్గంలో ధ్వంసమైన రోడ్లకు మరమ్మతులు చేపట్టినట్లు పేర్కొన్నారు. అలాగే దారి పొడువునా వీధి లైట్ల ఏర్పాటు, మరమ్మతులు, గుంతల పూడ్చివేత, ఇతర అన్ని మరమ్మతులు చేయించినట్లు వెల్లడించారు. పోలీసు శాఖ సూచన మేరకు శోభాయాత్ర మార్గం వెంబడి అలాగే, నిమజ్జన ఘాట్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించామన్నారు. విగ్రహాల నిమజ్జనం కోసం ప్రత్యేకంగా భారీ క్రేన్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఉత్సవ ఏర్పాట్లపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, ఏమైనా లోటుపాట్లు ఉంటే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. తద్వారా వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ శాఖల సంయుక్త సహాకారంతో పట్టణంలో నిమజ్జనోత్సవాలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. ప్రతి ఒక్కరు తమ ధర్మాన్ని గౌరవిస్తూనే, పర ధర్మ సహనం పాటిస్తూ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ బీబీ కుతిజా సిద్ధిఖ, కౌన్సిలర్లు ప్రవీణ్, సుభాష్, వడ్నపు శ్రీనివాస్, ఆమోల్, డి శ్రీనివాస్ పాల్గొన్నారు.


