ముధోల్: సెల్‌ఫోన్లు, కంప్యూటర్ల కారణంగా విద్యార్థుల్లో క్రమంగా తగ్గుతున్న పఠనాసక్తిని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందుకోసం ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. జిల్లాలో మొదటి దశలో ఎనిమిది ప్రభుత్వ పాఠశాలల్లో లైబ్రరీలు ఏర్పాటు చేయనుంది. ఎంపికై న బడుల్లో గ్రంథాలయం నిర్వహణకు తొలుత పాఠశాల కమిటీ పేరిట రూ.15వేల నిధులు జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఏర్పాట్లు పూర్తి చేసి గ్రంథాలయం నిర్వహిస్తే ప్రతినెలా రూ.వెయ్యి చొప్పున అందించనున్నారు. గ్రంథాలయాల్లో కథలు, జీవిత చరిత్రలు, సైన్స్, సాహిత్యం, పోటీ పరీక్షలు, బాల సాహిత్యం పుస్తకాలు అందుబాటులో ఉంటాయని గ్రంథాలయశాఖ అధికారులు తెలిపారు.
ఎంపికై నవి ఇవే..
గ్రంథాలయాల ఏర్పాటుకు అధికారులు జిల్లాలోని ఎనిమిది పాఠశాలలను ఎంపిక చేశారు. మామడ మండలంలో మామడ, పొన్కల్ ఉన్నత పాఠశాలలు, నర్సాపూర్(జి) మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల, కడెం మండలంలోని పెద్దూర్ లింగాపూ ర్ ఉన్నత పాఠశాల, భైంసా మండల కేంద్రంలోగల కిసాన్‌గల్లీ బాలికల ఉన్నత పాఠశాల, తానూర్ మండలంలోని భోసి ఉన్నత పాఠశాల, కుభీర్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల, నిర్మల్‌లోని సోమవార్‌పేట్ హైస్కూల్ ఎంపికయ్యాయి.


