● పోతపాలతో అనారోగ్య సమస్యలు
జిల్లాలో పాలిచ్చే తల్లులు 3,198
గర్భిణుల 5,355
నిర్మల్‌చైన్‌గేట్: మాతృత్వం మహిళ కు ఓ వరం. బిడ్డకు జన్మనివ్వడం పునర్జన్మ లాంటింది. అయితే ఉరుకుల పరుగుల జీవితం, అందం తగ్గిపోతుందన్న అపోహతో నేడు బిడ్డలకు పాలు ఇవ్వడానికి తల్లులు వెనుకాడుతున్నారు. కొందరైతే సరోగసి విధానంలో పిల్లల్ని కంటున్నారు. కానీ తల్లిపాలు బిడ్డకు అమృతమని వైద్యులు సూచిస్తున్నారు. ఏటా ఆగస్టు 1 నుంచి తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తారు. బిడ్డ పుట్టిన గంటలోపు పాలు అందేలా తల్లికి సహాయం చేయడమే వారోత్సవాల ముఖ్య ఉద్దేశం. తల్లిపాలు నవజాత శిశువు ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడతాయి. వీటిలోని వివిధ రకాల పోషకాలు పెరుగుదలకు తోడ్పడతాయి.
ముర్రుపాలతో ఆరోగ్యం..
పుట్టిన వెంటనే గంటలోపు ముర్రుపాలు ఇస్తే సహజ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందుకే వీటిని అమృతంతో పోలుస్తారు. లేత పసుపుపచ్చ రంగు పాలు మెదడు చురుకుగా పనిచేయడానికి, జ్ఞాపకశక్తి పెరగడానికి సహాయపడతాయి. గుండె, చర్మ సంబంధిత సమస్యలు, ఉబ్బసం, ఆస్తమా, రక్తపోటు, మధుమేహం వంటివి రాకుండా కాపాడతాయి. మొదటి ఆరు నెలలు రోజుకు 12 సార్లు పాలు తాగించాలి. ఇలా పెరిగిన పిల్లల్లో స్థూలకాయం వచ్చే అవకాశం తక్కువ. శనివారం నుంచి 8వ తేదీ వరకు జిల్లా కేంద్రంతోపాటు మండలాలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తల్లిపాలతో ప్రయోజనాలు...
తల్లిపాలతో శిశువుకు ప్రో టీన్లు అందుతాయి. దీనివల్ల మెదడు వికసిస్తుంది. సమతుల్య ఆహారం లభిస్తుంది. అవసరమైన విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. లాక్టోజ్ ఉండటంతో కాల్షియం నిల్వలు పెరిగి రక్తహీనత నుంచి రక్షణ కలుగుతుంది. తొలి దశలో అంటువ్యాధుల నుంచి కాపాడటమే కాకుండా మానసిక వికాసానికి తోడ్పడతాయి. న్యుమోనియా, డయేరియా వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి, అలాగే క్యాన్సర్, గుండె జబ్బులు, చెవి సమస్యల నుంచి రక్షణ కలుగుతుంది. ఆస్తమా, అలెర్జీ, మధుమేహం వంటివి దరిచేరవు. పోషకాహార లోపం తగ్గి శిశు మరణాలు కూడా తగ్గే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
వారోత్సవాల్లో నిర్వహించే కార్యక్రమాలు
తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాధాన్యత వివరిస్తారు. పిల్లల ఎదుగుదలపై అవగాహన కల్పిస్తారు. ఏడు నుంచి తొమ్మిది నెలల గర్భిణుల ఇళ్లకు వెళ్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తారు. బాలింతలు, గర్భిణులకు కౌన్సెలింగ్ ఇచ్చి వివరాలు నమోదు చేస్తారు. ఆరు నెలల లోపు చిన్నారులకు తల్లిపాలు అందుతున్నాయా అని తని ఖీ చేస్తారు. అంగన్‌వాడీ సిబ్బంది ఇంటింటికీ తిరిగి ఏడు నుంచి 24 నెలల పిల్లలకు తల్లిపాలతోపాటు అదనపు ఆహారం ఇవ్వాలని సూచిస్తారు. సమతుల్య ఆహార తయారీపై అవగాహన కల్పిస్తారు.


