కొత్త గుడిలో పునఃదర్శనం | - | Sakshi
Sakshi News home page

కొత్త గుడిలో పునఃదర్శనం

Jul 5 2026 7:20 AM | Updated on Jul 5 2026 7:20 AM

● ప్రధాన ఆలయంలో దర్శనాలు నిలిపివేత ● బాలాలయంలో చదువుల తల్లి ● శాస్త్రోక్తంగా దారు విగ్రహాల ప్రాణప్రతిష్ఠ.. ● నేటి నుంచి దర్శనాలు ఇక్కడే..

భైంసా : బాసర శ్రీజ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బాలాలయంలో అమ్మవారి దర్శనం ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమవుతోంది. ఆలయ ప్రాంగణంలోని రూ.150 అక్షరాభ్యాస మండపాన్ని శాస్త్రోక్తంగా బాలాలయంగా మార్చారు. శృంగేరి పీఠం నుంచి తీసుకొచ్చిన దారు విగ్రహాలను ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం ప్రతిష్ఠించారు. శనివారం ఉదయం నుంచి వేద పండితులు మంత్రోచ్ఛారణలతో హోమాలు, విశేష పూజలు నిర్వహించి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వైభవంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

దర్శనం, సేవలు యథావిధిగా..

బాలాలయంలో అమ్మవారి దర్శనంతోపాటు నిత్యపూజలు, మహామంగళహారతి, అభిషేకాలు, అర్చనలు, అక్షరాభ్యాసం వంటి అన్ని సేవలను ప్రధాన ఆలయంలో నిర్వహించినట్లు కొనసాగిస్తారు. పునర్నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు భక్తులందరూ బాలాలయంలోనే అమ్మవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది.

ప్రధాన గర్భగుడి మూసివేత..

పునర్నిర్మాణం సజావుగా జరిగేందుకు ప్రధాన గర్భగుడిలో సాధారణ భక్తుల ప్రవేశాన్ని నిలిపివేశారు. గర్భాలయంలో వేద పండితులు, అర్చకులు మాత్రమే ఆగమ శాస్త్ర ప్రకారం నిత్యపూజలు, హారతులు నిర్వహిస్తారు. భక్తుల దర్శన సౌకర్యాలన్నీ బాలాలయానికి మార్చారు. ప్రధాన ఆలయ నిర్మాణ బాధ్యతను హైదరాబాద్‌కు చెందిన దాత సురపునేని సునంద్‌ స్వచ్ఛంగా స్వీకరించారు. ప్రభుత్వ అనుమతితో ఆయన ఆధ్వర్యంలో పనులు చేపడుతున్నారు. మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వ నిధులతో పూర్తి చేయనున్నారు. నిర్మాణంలో సంప్రదాయ శిల్పకళ, ఆగమ శాస్త్ర నియమాలు పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

భక్తుల ఆశలు..

బాసర జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయం దేశవ్యాప్తంగా అక్షరాభ్యాసానికి ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. ఏటా లక్షలాది చిన్నారులు ఇక్కడ విద్యారంభం చేసి ఆశీర్వాదాలు పొందుతారు. పునర్నిర్మాణం పూర్తయిన తర్వాత మరింత వైభవంగా తీర్చిదిద్దబడే ఆలయాన్ని చూడాలని రాష్ట్రంతోపాటు దేశ, విదేశాల్లోని భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈవో అంజనీదేవి మాట్లాడుతూ, పునర్నిర్మాణం పూర్తయ్యే వరకు భక్తులు సహకరించి బాలాలయంలోనే అమ్మవారిని దర్శించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మూల విరాట్‌ పునఃదర్శనం కొత్త గుడిలోనే ఉంటుందని పేర్కొన్నారు. ఈ మహత్తర కార్యక్రమం విజయవంతంగా పూర్తయి, భక్తులకు మరింత శోభాయమానమైన ఆలయంలో దర్శనం కల్పించే రోజు కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement